గ్రామీణ విద్యలో సత్ఫలితాలు

కేంద్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు

Feb 13, 2025 - 17:08
 0
గ్రామీణ విద్యలో సత్ఫలితాలు

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: భారత్​ దేశంలో బాలబాలికల విద్యలో నగరాల్లో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ గ్రామాల్లో ఆశించిన స్థాయిలో ఉండడం లేదని కేంద్ర ప్రభుత్వం గమనించింది. ఈ నేపథ్యంలో 2014 తరువాత ప్రధాని మోదీ ఎన్నికయ్యాక గ్రామాల్లోని చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు పటిష్ఠమైన ప్రణాళికలు, చర్యలతో ముందుకు వెళ్లింది. ప్రతీఏటా విడుదలయ్యే ఎఎస్​ఇఆర్​ (వార్షిక విద్యా స్థితి నివేదిక-–యాన్యువల్​ స్టేటస్​ ఆఫ్​ ఎడ్యుకేషన్​ రిపోర్ట్​)పై దృష్టి సారిస్తూ పటిష్ఠ చర్యలకు అంకురార్పణ చేశారు. ఈ సంస్థ గ్రామాల్లోని బాలబాలికలు చదువుకునేందుకు పాఠశాలకు వెళుతున్నారా? వెళితే వారి విద్యను తల్లిదండ్రులు పర్యవేక్షిస్తున్నారా? పాఠశాల విద్యార్థులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారా? విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక స్థితి గతులు లాంటి పరిస్థితులను ఆరా తీసి సమగ్రంగా ఓ నివేదిక రూపొందించి వార్షికంగా విడుదల చేస్తుంది. ఈ సంస్థ అందజేసే నివేదిక ద్వారా లోటుపాట్లను ప్రతీఏటా కేంద్ర ప్రభుత్వం సవరించుకుంటూ మెరుగైన విద్యకు శ్రీకారం చుడుతుంది. 

2024 డేటా ప్రకారం 2005 నివేదికతో పోలిస్తే గ్రామీణ బాలబాలికల విద్యలో భారీ తేడా వచ్చింది. ప్రస్తుతం 6–14 ఏళ్ల వయస్సున్న పిల్లలంతా 98 శాతం మేర బడిబాట పడుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. అదే సమయంలో ఏయే తరగతి విద్యార్థుల్లో చదవగలిగే ప్రమాణాలను కూడా గణించింది. 2010 గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో మూడో తరగతి విద్యార్థులు సరళమైన పాఠ్యాంశాలను చదివే వారి సంఖ్య 17 శాతంగా ఉండగా, 2018 నాటికి 21 శాతానికి, 2024 నాటికి 23.4 శాతానికి చేరింది. చదవడంలో విద్యార్థులు వెనుకబడి ఉన్నా గణితంలో మెరుగుదల కనిపిస్తుంది. కరోనా కాలంలో రెండెళ్లపాటు వెనుకబడ్డ విద్యార్థులు 2022 నుంచి తిరిగి పుంజుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వయసు ఆధారిత అభ్యాస ప్రక్రియ ద్వారా ముందుకు వెళ్లాలని, ఖచ్చితమైన ఫలితాలను రాబట్టాలని స్పష్టం చేసింది. మొత్తానికి గ్రామీణ బాలబాలికలు పాఠశాలల్లో చేరికల్లోనే గాకుండా వారిలో పఠనాసక్తి ప్రదర్శనలో కూడా ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని అసార్​ డేటా వెల్లడిస్తుంది.