మోదీ వారసుడు షా, యోగి?
సీ ఓటర్ సర్వేలో ఆసక్తికర విషయాలు

నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ప్రధాని మోదీ తరువాత ఆ స్థానానికి అర్హులేవరన్న సీఓటర్ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. తరువాతి ప్రధానిగా ఎక్కువశాతం మంది అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ వైపు మొగ్గుచూపారు. వీరిద్దరి మధ్య స్వల్ప తేడానే ఉండడం గమనార్హం. మోదీ వారసుడిగా షాను 26.8 శాతం, యోగికి 25.3 శాతం ప్రజల మద్ధతు లభించింది. ఆ తరువాతి స్థానంలో నితిన్ గడ్కరీ 14.6 శాతం, రాజ్ నాథ్ సింగ్ 5.5 శాతం, శివరాజ్ సింగ్ చౌహాన్ 3.2 శాతం మద్ధతు లభించింది. గతంలో సర్వే సందర్భంగా యోగికి ఈ సర్వేలో 18.8 శాతం మద్ధతు లభించగా, ప్రస్తుతం అది భారీగా పెరిగింది.
కాగా సర్వేలో దేశంలో ఇప్పటివరకు అత్యుత్తమ ప్రధానమంత్రి ఎవరని అడగ్గా 50.7 శాతం మంది మోదీ, 13.6 శాతం మన్మోహన్ సింగ్, 11.8 శాతం వాజ్ పేయి, 10.3 శాతం మంది ఇందిరాగాంధీ, 5.2 శాతం నెహ్రూలని తమ అభిప్రాయాలను వెల్లడించారు. 61.8 శాతం మంది ప్రజలు మోదీ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మూడోసారి ప్రధానిగా మోదీ ఎన్నికై దేశాన్ని గాడిన పెడుతుందా? అన్న ప్రశ్నకు 62.1 శాతం మద్ధతునిచ్చారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం మోదీ సాధించిన అతిపెద్దవిజయంగా అభివర్ణించారు. రాజకీయ స్థిరత్వంపై 13.2శాతం, అవినీతి రహిత ప్రభుత్వం 10.6శాతం మంది, ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచారాన్ని 10.1శాతం మంది, మౌలిక సదుపాయాల అభివృద్ధిని 8.6శాతం మంది, సంక్షేమ పథకాలను 7.4శాతం మంది, ఆర్టికల్ 370 రద్దును 7.3శాతం మంది మోదీ ప్రభుత్వం సాధించిన ప్రధాన విజయాలుగా భావించారు. మొత్తంగా చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై దేశంలోని అత్యధిక మంది ప్రజలు సంతోషంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.