కశ్మీర్ లేకుండా భారత మ్యాపు
కాంగ్రెస్ పార్టీ తప్పిదంపై బీజేపీ ఆగ్రహం
బెంగళూరు: భారత మ్యాపులో కాశ్మీర్ భాగం లేకుండానే పోస్టర్ల ద్వారా కాంగ్రెస్ ప్రచారం బీజేపీకి ఆగ్రహం కలిగించింది. బెళగావి కాంగ్రెస్ సమావేశాల నేపథ్యంలో ఈ పోస్టర్ ను రూపొందించారు. ఈ మ్యాపులో భౌగోళికంగా కాశ్మీర్ భాగమే లేకపోవడం విమర్శలకు తావిస్తుంది. ఈ మ్యాపుపై కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకా అధికారిక ప్రకటన లేదు. ఈ పోస్టర్ అంశం కాస్త వివాదాస్పదం అవుతుండడంతో వెంటనే స్పందించిన స్థానిక కాంగ్రెస్ నాయకులు పోస్టర్లను తొలగించారు. ప్రింటింగ్ లో తప్పిదం జరిగిందన్నారు. 1924లో మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో డిసెంబర్ 26, 27 తేదీల్లో బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణ మహాసభలు నిర్వహించారు. ఆ రోజుకు గుర్తుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రెండు రోజులు సమావేశాలు ఏర్పాటు చేశారు. సమావేశాల సందర్భంగా గాంధీజీ చిత్రంతో కూడిన భారత మ్యాపును రూపొందించే పోస్టర్ ను ముద్రించారు. ఈపోస్టరే ఇప్పుడు వివాదాలకు కారణమవుతుంది. కాగా ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.