గిరిజన సంక్షేమానికి నిధులు హర్షణీయం
కేంద్రమంత్రి జూయల్ ఓరమ్
అగర్తలా: గిరిజన సంక్షేమానికి, పథకాల అమలుకు కేంద్రం కేటాయిస్తున్న నిధుల ద్వారా నిర్ణయించిన లక్ష్యాలను సమర్థవంతంగా చేరుకుంటున్నామని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జూయల్ ఓరమ్ తెలిపారు. ఆదివారం మంత్రి ఓరమ్ అగర్తలా లో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. 2024–25 కేంద్ర బడ్జెట్ గిరిజనుల కేటాయింపులపై హర్షం వ్యక్తంచేశారు. గతంలో కేటాయించిన బడ్జెట్ తో గిరిజన సంక్షేమంలో 73 శాతం వృద్ధిని సాధించగలిగామని తెలిపారు. ప్రస్తుత బడ్జెట్ లో గిరిజన పథకాలకు రూ. 13వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు.
పేదల సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణ, గిరిజన సంక్షేమంపై కేంద్రం బడ్జెట్ లో దృష్టి సారించడం, నిధులు కేటాయించడం సంతోషకరమన్నారు. ఈశాన్య ప్రాంతమైన త్రిపుర అభివృద్ధికి రూ. 458 కోట్లతో 14 ప్రాజెక్టులకు ఆమోదం లభించడంపై ఓరమ్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ నిధులతో పీఎం జనజాతి ఉన్నత్ గ్రామ అభియాన్ పథకం దేశంలోని 63,000 గ్రామాలను కవర్ చేస్తుందని, రోడ్ కనెక్టివిటీ, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు వంటి మౌలిక సదుపాయాలను పెంపొందించడంలో ఇది పెద్దపీట వేస్తుందని మంత్రి చెప్పారు.
గ్రామీణాభివృద్ధికి 2.6 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపు జరిగిందని, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన దేశవ్యాప్తంగా 25,000 గ్రామీణ ఆవాసాలను కవర్ చేస్తుందని అన్నారు. బడ్జెట్ కేటాయింపులతో గ్రామాల రూపురేఖలు మారనున్నాయని, ఈశాన్య ప్రాంత అభివృద్ధికి దోహదపడనున్నాయని మంత్రి ఓరమ్ తెలిపారు.