మార్చి 10లోగా మణిపూర్ సీఎం
మొయిటీ, కుకీ, ఇతరులకా?

బీజేపీ అధిష్టానం ఢిల్లీ స్ర్టాటజీని అనుసరిస్తుందా?
ఇంఫాల్: మణిపూర్ లో మార్చి 10లోపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు గురువారం బీజేపీ వర్గాలు వెల్లడించాయి. సీఎం బీరెన్ సింగ్ రాజీనామాతో మరో సీఎం ఎవరన్నదానిపై చర్చలు జరగ్గా రేసులో మొయిటీ వర్గానికి చెందిన వారినే నియమించనున్నట్లు సమాచారం. పోటీలో ముగ్గురు ఉన్నారు. వీరంతా మొయిటీ వర్గానికి చెందిన వారే కావడం, పలువురు వ్యతిరేకించడంతో ఏకాభిప్రాయం కుదురక ఫిబ్రవరి 13న రాష్ర్టపతి పాలన విధించారు. ఫిబ్రవరి 28 వరకు ఆయుధాలను వీడాలని అధికారులు హెచ్చరించారు. ఆ తరువాత కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొయిటీ, కుకీలకు చెందిన వందమందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. రాష్ర్టపతి పాలన విధించినా ఇంకా రాష్ర్టంలో అసెంబ్లీని రద్దు చేయలేదు. ఈ నేపథ్యంలో మార్చి 10 వరకు సీఎంను నియమించాలని బీజేపీ అధిష్టానం యోచిస్తుంది.
మణిపూర్ అసెంబ్లీ 60 స్థానాల్లో గత ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే మెజార్టీ మార్క్ ను దాటింది. 32 స్థానాలను సాధించింది. ఎన్పీఎఫ్ ఎన్డీయే మిత్రపక్షంగా కొనసాగగా ఆ పార్టీకి ఐదుస్థానాలు లభించాయి. దీంతో బీజేపీ బలం 37కు చేరింది. అయితే జేడీయూ నుంచి విజయం సాధించిన ఆరుగురిలో ఐదుగురు బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ బలం 42కు పెరిగింది. కాంగ్రెస్ 5, ఇతరులు ఐదు, ఎన్ పీపీ 7 స్థానాలు దక్కాయి. ఈ నేపథ్యంలో అయితే మొయిటీ వర్గానికి చెందిన 22 మంది కుకీ వర్గానికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలున్నారు. సీఎం ఎవరన్నదానిపై ఇక్కడే పేచీ నెలకొంది. దీంతో బీజేపీ అధిష్ఠానం ఇటీవల మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, న్యూ ఢిల్లీ స్ర్టాటజీని అనుసరించి ఈ ఇరు వర్గాలకు చెందిన వారిని గాకుండా ఇతర వర్గానికి చెందిన వారిని సీఎంగా ఎన్నుకునే అవకాశం లేకపోలేదనే వాదన కూడా ఉంది. అయితే ఈ సమస్యను పరిష్కరించడంతో మోదీ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో? అన్న సందేహం అందరిలోనూ కనిపిస్తుంది.