అంబరాన్నంటిన హోళీ సంబురాలు
Holi celebrations around Ambarannanthi

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా హోళీ సంబురాలు అంబరాన్నంటాయి. రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, జి.కిషన్ రెడ్డి తదితరులు ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపారు. హోళీ దుష్టశక్తి అంతానికి చిహ్నామన్నారు. సత్యానికి, విజయానికి సంకేతమన్నారు. పరస్పర సోదరభావంతో, సామరస్యంగా పండుగను నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.
మరోవైపు దేశవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద హోళీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రంజాన్ శుక్రవారం కూడా ఉండడంతో పోలీసులు దేశంలోని ఆయాచోట్ల అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ర్ట, ఢిల్లీ సహా ప్రముఖ రాష్ర్టాల్లో ఉన్న మసీదుల వద్ద భారీ బందోబస్తు కోసం ఆర్మీ, డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం రేఖాగుప్తా, ప్రవేశ్ వర్మలు హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. జేపీ నడ్డా తన నివాసంలో వేడుకలు నిర్వహించారు.
అయోధ్య, మధ్యప్రదేశ్ ఉజ్జయిని, ఒడిశాలోని పూరి, యూపీలోని మధుర, బృందావన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి హోళీ వేడుకలు నిర్వహించారు. అయోధ్యలో శ్రీరాముడు విల్లుకు బదులుగా రంగులు చల్లె పిచికారీని చేతబూనాడు. ఉజ్జయినీలో మహాకాళుడికి ప్రత్యేక పూజలు, హారతులకు ముందు గులాల్ తో అలంకరించారు. ఆ పై మహాహారతి ఇచ్చారు. టీఎంసీ కంచుకోట పశ్చిమ బెంగాల్ లోనూ మహిళలు రోడ్లపైకి వచ్చి, ఆలయాల వద్ద హోళీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఒడిశా పూరిలో ప్రముఖ ఇసుక చిత్రకారుడు సుదర్శన్ పట్నాయక్ రాధాకృష్ణ చిత్రాలను రూపొందించి దేశ ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపారు. గోరఖ్ పూర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ ప్రాంగణంలోని గోమాతతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హోళీ వేడుకలను ప్రారంభించారు. యూపీలోని వారణాసి, అజ్మీర్ లలో విదేశీయులు సైతం హోళీ వేడుకల్లో పాల్గొని భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక త్రిపురలో బీఎస్ ఎఫ్ జవాన్లు డ్యాన్సులతో హోరెత్తిస్తూ పర్వదినాన్ని కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు. తమిళనాడులోని ప్రముఖ ఆలయాల వద్ద భక్తులు భగవంతుని దర్శనం కోసం బారులు తీరారు. దర్శనాలు, ప్రత్యేక పూజల అనంతరం హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. అసోం దిబ్రూఘర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే ఆలయాల వద్ద భక్తుల కోలాహలం,సందడి నెలకొంది. అనంతరం హోళీ వేడుకల్లో పాల్గొని ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.