బంగారం.. బంగారమాయే!
Gold.. gold!

దేశాల ఆర్థిక స్థిరత్వానికి పసిడి నిల్వలే కీలకం
భారత్ లో ఎంతుందో ఎవ్వరికెరుక!
అత్యధిక బంగారం నిల్వల్లో ముందంజలో అమెరికా
ఎనిమిదో స్థానంలో భారత్
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: భారత్ లో పసిడి లక్ష మార్కుకు చేరువలో ఉంది. పెళ్లిళ్ల సీజన్ మొదలవడంతో బంగారానికి భారీ డిమాండ్ ఏర్పడింది. భారత్ లో బంగారం డిమాండ్ ను వీక్షిస్తున్న ప్రపంచంలోని 20 దేశాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువపై ఔరా అని నోళ్లు తెరుచుకొంటున్నాయి. ఏ దేశానికైనా ఆర్థిక స్థిరత్వానికి బంగారం నిల్వలు కూడా అతి ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. 1800, 1900లలో అనేక దేశాలు బంగారాన్ని తమ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించాయి. దీంతో క్రమేణా బంగారం ఆర్థిక వ్యవస్థలో విడదీయరాని అంతర్భాగంగా నిలిచింది. కరెన్సీని బంగారంగా మార్చుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో దేశ ఆర్థిక స్థిరత్వానికి అవకాశం ఏర్పడింది. ఏ దేశాల ఆర్థిక వ్యవస్థలైనా సంక్షోభాలు తలెత్తినప్పుడు బంగారు నిల్వలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు కీలకంగా నిలుస్తుంటాయి. అందుకే బంగారాన్ని వెలికితీయడం ఎంతో కష్టమైనా ఆ శ్రమకోర్చి కోట్లాది రూపాయలు వెచ్చించి గనుల నుంచి వెలికి తీసి మరీ తమ దేశ ఆర్థిక స్థితిని చక్కదిద్దుకుంటాయి. పేరుకే భారత్ బంగారం నిల్వల్లో 8వ స్థానంలో ఉన్నా, ఏ ఇంట్లో ఎంత బంగారముందనేది ఎవ్వరికీ తెలియదు. ఈ లెక్కన చూసుకుంటే భారత్ లో ఉన్నంత బంగారం మరే దేశం వద్ద లేవనే వాదనలూ ఉన్నాయి. ఈ లెక్కలు కేవలం ప్రభుత్వాల వద్ద ఉన్న అధికారిక లెక్కలు మాత్రమేనండోయ్. అనధికారం అదనం!
ప్రపంచంలో అత్యధిక నిల్వలు–2024 ప్రకారం..
అమెరికా– 8,133.46 టన్నులు
జర్మనీ– 3,351.53 టన్నులు
ఇటలీ– 2,451.84 టన్నులు
ఫ్రాన్స్– 2,436.97 టన్నులు
రష్యా– 2,335.85 టన్నులు
చైనా– 2,264.32 టన్నులు
జపాన్– 845.97 టన్నులు
భారతదేశం– 840.76 టన్నులు
నెదర్లాండ్స్– 612.45 టన్నులు
టర్కీ– 584.93 టన్నులు
పోర్చుగల్– 382.66 టన్నులు
పోలాండ్– 377.37 టన్నులు
ఉజ్బెకిస్తాన్– 365.15 టన్నులు
యునైటెడ్ కింగ్‌డమ్– 310.29 టన్నులు
కజకిస్తాన్– 298.8 టన్నులు
స్పెయిన్– 281.58 టన్నులు
ఆస్ట్రియా– 279.99 టన్నులు
థాయిలాండ్– 234.52 టన్నులు
సింగపూర్– 228.86 టన్నులు
బెల్జియం– 227.4 టన్నులు
కాగా ఇప్పటివరకు ప్రపంచంలో దాదాపు2,44,000 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కనుగొన్నారు. ఇందులో 1,87,000 మెట్రిక్ టన్నుల బంగారం వెలికితీయగలిగారు. మరో 57,000వేల మెట్రిక్ టన్నుల బంగారం ఇంకా భూగర్భంలోనే ఉంది. ఈ నిల్వల్లో అత్యధికంగా చైనా, ఆస్ర్టేలియా, దక్షిణాఫ్రికాలోనే ఉన్నాయి. కాగా ఇటీవల పాకిస్థాన్ తమ భూభాగంలో 600 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్లుగా ప్రకటించింది. అయితే ఆ నిల్వలను తవ్వితీసేందుకు పాక్ వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. పైగా వెలికితీసే బంగారానికి పెద్ద ఎత్తున నిధులు అవసరం కావడంతో వెలికితీసే బంగారానికి, పెట్టే ఖర్చుకు సమం అవుతుందనే లెక్కలతో ఏ దేశమూ పాక్ లోని బంగారం గనులను తవ్వేందుకు ముందుకు రాని పరిస్థితి. ఇంకేముంది చేతిలో బంగారు పళ్లెం ఉన్నా దానిలో అన్నం తినలేకపోతుంది పాపం పాక్.