ఢిల్లీలో ప్రముఖుల ఓట్లు

ఉదయం 9 గంటల వరకు 8.10 శాతం నమోదు

Feb 5, 2025 - 10:02
 0
ఢిల్లీలో ప్రముఖుల ఓట్లు

నా తెంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీలో 70 స్థానాలకు గాను ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్​ ప్రారంభమైంది. 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13,766 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరుగుతుంది. 699 మంది అభ్యర్థుల ఎన్నికల భవితవ్యాన్ని నిర్ణయించనుంది. ఓటింగ్ ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు, 200 కంపెనీలకు పైగా పారామిలిటరీ దళాలు, 35 వేలకు పైగా ఢిల్లీ పోలీసు సిబ్బందిని మోహరించారు. ఢిల్లీలోని దాదాపు 3000 పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా ప్రకటించారు. పోలీసులు డ్రోన్ల ద్వారా నిఘా ముమ్మరం చేశారు. ఉదయం 9:00 గంటల వరకు 8.10శాతం ఓటింగ్ నమోదైంది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
రాష్ట్రపతి ఎస్టేట్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతీఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 

ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి..
ప్రజాస్వామ్య హక్కును ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, తొలిసారి ఓటువేసే వారు ఉత్సాహంగా ఓటింగ్​ లో పాల్గొనాలి. ముందుగా ఓటు వేయాలన్నారు. ఆ తరువాతే అన్నీ అని ‘పహెలే మత్​ దాన్​ ఫిర్​ జల్​ పాన్​’ అని సామాజిక మాధ్యమం వేదికగా విజ్ఞప్తి చేశారు. ఓటు అమూల్యమైనదని గుర్తుంచుకోవాలన్నారు. 

ఎన్నికల కమిషనర్ సంధు..
ఎన్నికల కమిషనర్ డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు తన ఓటు హక్కును మోతీ బాగ్ అసెంబ్లీ పోలింగ్ బూత్‌లో వినియోగించుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో ఉదయం నుంచి ఓటింగ్ సజావుగా కొనసాగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశాం. అన్ని పోలింగ్ బూత్‌లలో ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఓటు వేసేందుకు వచ్చిన వారు నిర్భయంగా తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలి. 

బీజేపీ ఎంపీ బాన్సూరి స్వరాజ్..
బీజేపీ ఎంపీ బాన్సూరి స్వరాజ్​ ఢిల్లీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఫిబ్రవరి 8న కమలం వికసించనుందని ధీమా వ్యక్తం చేశారు. రోడ్లు, నీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి అన్ని వ్యవస్థలను మార్చడానికి, దేవుడిలాంటి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలిరావాలని ప్రజాస్వామ్య హక్కును సంపూర్ణంగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది..
ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఆయన భార్య సునీతా ద్వివేది కామరాజ్ లేన్‌లోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వేలికి ఉన్న సిరా గుర్తును చూపుతూ ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని అభ్యర్థించారు. 

కేంద్రమంత్రి హర్దీప్ పూరి.. 
కేంద్ర మంత్రి హర్దీప్ పూరి ఆనంద్ నికేతన్‌లోని మౌంట్ కార్మెల్  పాఠశాలలో కుటుంబంతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా..
ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా తన సతీమణితో కలిసి మోతీ బాగ్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

దర్యాగంజ్‌లోని పోలింగ్ బూత్‌ తొలి ఓటు..
దర్యాగంజ్​ లోని పోలింగ్​ బూత్​ లో ముస్కాన్​ గార్గ్​ అనే యువతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా ముస్కాన్​ వేసిన ఓటు తొలి ఓటు కావడం గమనార్హం. 

కేంద్రమంత్రి ఎస్. జైశంకర్..
ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కుటుంబంతో కలిసి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్​. జై శంకర్​ ఓటు హక్కు వినియోగించనున్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలన్నారు. 

బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా..
ఢిల్లీ అభివృద్ధి కోసం ఓటు వేయాలి. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. మార్పు రావాలంటే ఉత్సాహంగా ఓటింగ్​ లో పాల్గొని ఢిల్లీ అభివృద్ధికి బాటలు వేయాలి. బీజేపీ అధ్యక్షుడు వీరంద్ర సచ్​ దేవా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

బిజెపి అభ్యర్థి విజేంద్ర గుప్తా.. 
రోహిణి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి విజేంద్ర గుప్తా, భార్యతో కలిసి ఓటింగ్​ లో పాల్గొన్నారు. మార్పును కోరుకునే ప్రతీ ఒక్కరూ ఓటింగ్​ లో పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.