ప్రధానితో సీఎం భేటీ
CM met Prime Minister

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రోడ్ల మరమ్మతులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. శనివారం ఉదయం ప్రధాని నివాసంలో సీఎం కలిశారు. రెండు రోజులుగా నిర్వహిస్తున్న వరుస మంత్రివర్గ సమావేశాల సారాంశాలను ప్రధానికి వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని రేఖా గుప్తాను అభినందించారు. పాలనలో బీజేపీ మార్కు చూపించాలని కోరారు. ప్రజల ఆకాంక్షల అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రం ఢిల్లీ ప్రభుత్వానికి అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ప్రధానితో భేటీకి ముందు గుప్తా షాలిమార్ బాగ్ లోని తన నివాసం బాల్కనీ నుంచే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తనకు అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నగరాన్ని సుందరంగా తీర్దిదిద్దే బాధ్యత తనపై ఉందన్నారు. ఇప్పటికే యమునా ప్రక్షాళన, ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆమోదించామన్నారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన వికసిత్ భారత్ లో ఢిల్లీ ప్రభుత్వం భాగస్వామ్యమై అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుందన్నారు. ప్రధానిని కలిసిన తరువాత సీఎం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో దెబ్బతిన్న రోడ్లను సరిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీశారు. అలాగే ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ముందుగా దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. కొత్తగా వేసే రోడ్ల జీవితకాలం కనీసం పదేళ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తరచూ రోడ్లు మరమ్మతులకు గురి కావొద్దన్నారు. అలాగే నగర రోడ్లపై ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాశ్రేయస్సుకై మేలైన, నాణ్యమైన నిర్ణయాలను తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.