కుంభమేళా @ 59 కోట్లు!
Kumbh Mela @ 59 Crores!

లక్నో: మహాకుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య శనివారం మధ్యాహ్నానికి 59 కోట్లకు చేరుకుంది. పుష్కరాలు మొదలై 41 రోజులు గడుస్తున్నా ఏ మాత్రం భక్తుల సంఖ్య తగ్గడం లేదు. ఇంకా నాలుగురోజులే మిగిలి ఉండడం, వారాంతం రోజులు కావడంతో భారీ ఎత్తున భక్తులు ప్రయాగ్ రాజ్ కు చేరుకుంటున్నారు. దీంతో ప్రయాగ్ రాజ్ వ్యాప్తంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. యుమునా నదిపై ఏడు గంటలుగా ట్రాఫిక్ స్తంభించింది. షటిల్ బస్సులు కూడా ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి. దీంతో అరగంట ప్రయాణానికి నాలుగు గంటలు పడుతుందని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. కాగా ఏడు ఎంట్రీ పాయింట్ల వద్దే బయటి వాహనాలను నిలిపివేస్తున్నారు. నగరం వెలుపలే పార్కింగ్ ఏర్పాటు చేశారు. ప్రయాగ్ రాజ్ కు దారితీసే 8 రహదారుల్లో 10 నుంచి 12 కి.మీ. మేర నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. అయితే భక్తుల సౌకర్యార్థం చిన్నవాహనాలను అనుమతిస్తున్నారు. వీటితోపాటు బైకర్లు ప్రయాణికులను త్రివేణి సంగమం వద్దకు తీసుకువెళతున్నారు.