గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

All set for Republic celebrations

Jan 25, 2025 - 17:34
 0
గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

15వేల మందితో ఆరు లేయర్లలో భద్రత
ఢిల్లీ వ్యాప్తంగా 144 సెక్షన్​ అమలు
50వేల మంది అనుమానితులతో ప్రత్యేక సర్వర్​ ఏర్పాటు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. అడుగడుగునా డేగకళ్ల నిఘా, పోలీసుల తనిఖీలు, భద్రతా దళాలు, త్రివిధ దళాలు భద్రతను కల్పిస్తున్నాయి. 15వేల మంది పోలీసులతో ఆరు లేయర్ల భద్రత, ఏఐ కెమెరాలు, రిజర్వ్​ పోలీసులు, క్విక్​ రెస్పాన్స్​ టీమ్​ లు, స్వాట్​ కమండోలు, బాంబ్​ డిస్పోజబుల్​, ఇన్వెస్టిగేషన్​ టీమ్​, ట్రాఫిక్​ పోలీసులు, ఔటర్​ లో సెక్యూరిటీ లేయర్​ లు గణతంత్ర వేడుకలు ప్రశాంతంగా నిర్వహించేందుకు వినియోగిస్తున్నారు. విధులు, రోడ్లు, భవనాలు ప్రతీచోటా నిఘాను ముమ్మరం చేశారు. పరేడ్​ మార్గంలో కూడా ఆరు స్థాయిలలో భద్రతను ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. రాష్ర్టపతి భవన్​ నుంచి ఎర్రకోట వరకూ వ్యూహాత్మక ప్రదేశాల్లో పారామిలటరీ బలగాలను మోహరించరు. ఢిల్లీ సరిహద్దుల్లో ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. భద్రతా చర్యలను కంట్రోల్​ రూమ్​ ల నుంచి పర్యవేక్షించనున్నారు. 

ఇక వీఐపీలు, వీవీఐపీలు, వారి అతిథుల భద్రతకు ప్రత్యేక సిబ్బందిని మోహరించారు. వారి చుట్టూ నిఘా నీడను పటిష్ఠం చేశారు. భద్రతాధికారులంతా సెంట్రల్​ కమాండ్​ సెంటర్​ తో అనుసంధానమైన ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలను అందజేస్తుంటారు, పర్యవేక్షించనున్నారు. ఎత్తైన భవనాలపై ప్రత్యేక భద్రత సిబ్బందిని మోహరించారు. వీరితోపాటు వందమంది స్నైపర్​ సిబ్బందిని మోహరించారు. అలాగే ఢిల్లీ వ్యాప్తంగా 144 సెక్షన్​ అమల్లోకొచ్చింది. పతంగులు ఎగరవేయటాన్ని నిషేధించారు. ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలన్నింటినీ సర్వర్​ కు అనుసంధానించారు. ఈ సర్వర్​ లో 50వేల మంది అనుమానితులు, ఉగ్రవాదులు, నేరస్థుల ఫోటోలు ఉన్నాయి. ఈ సర్వర్​ ద్వారా ఆటోమెటిక్​ స్కాన్​ చేసుకుంటుంది. కెమెరా ముందు అనుమానితులు కనిపిస్తే వెంటనే భద్రతా సిబ్బందిని అలర్ట్​ చేస్తారు.