జబల్పూర్ లో ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
Accident-in-Jabalpur..-Eight-killed

మృతులంతా హైదరాబాద్ వాసులు
నలుగురికి తీవ్రగాయాలు
ప్రయాగ్ రాజ్ వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం
భోపాల్: ప్రయాగ్ రాజ్ నుంచి తిరిగి వస్తున్న హైదరాబాద్ కు చెందిన యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వీరంతా హైదరాబాద్ లోని నాచారం ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తుంది. ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించి మినీ బస్సు (ఎపీ29డబ్ల్యూ–1525)లో తిరిగి వస్తుండగా మధ్యప్రదేశ్ లోని జబల్బూర్ లో సిమెంటు లోడుతో రాంగ్ రూట్ లో వస్తున్న లారీ అతివేగంగా వీరి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో సంఘటనా స్థలంలోనే ఎనిమిది మంది మృతి చెందినట్లు జబల్పూర్ కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా తెలిపారు. ప్రమాదం ఉదయం 8.30 గంటలకు జరిగిందన్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, తాను ప్రమాదస్థలికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించామన్నారు. కాగా ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వెంటనే యాత్రికులకు అవసరమైన సహాయం, చికిత్స, మృతదేహాలను తిరిగి వచ్చే చర్యలపై పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. మినీబస్సులో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రమాదంపై ఆరా తీశారు. వెంటనే యాత్రికులకు సహాయం చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రమాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి..
మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాద ఘటనపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే.. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను అందించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని కేంద్రమంత్రి సూచించారు. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల కలెక్టర్లతోనూ మంత్రి మాట్లాడి, ఆయా కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబసభ్యులనూ ఫోన్‌లో కేంద్రమంత్రి పరామర్శించారు. ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు.