11,12 నో వెహికిల్ జోన్ గా ప్రయాగ్ రాజ్
అధికారులకు సీఎం యోగి స్పష్టమైన ఆదేశాలు

లక్నో: ప్రయాగ్ రాజ్ ను నో వెహికిల్ జోన్ గా ప్రకటించారు. 11, 12వ తేదీలలో ప్రయాగ్ రాజ్ కు వచ్చే అన్ని వాహనాలపై ఆంక్షలు విధించారు. మాఘ పూర్ణిమ సందర్భంగా ఏర్పాట్లను సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ఆరా తీశారు. ఎలాంటి పొరపాట్లకు తావీయవద్దని అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లలో పలు లోటుపాట్లపై ఇద్దరు ఐపీఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రకాల వీఐపీ, వీవీఐపీ పాస్ లను రద్దు చేశారు. దీంతో 11, 12న పోలీసు, అంబులెన్స్, పరిపాలనా అధికారుల వాహనాలు మాత్రమే ప్రయాగ్ రాజ్ లో తిరగనున్నాయి. భక్తుల వాహనాలకు ప్రయాగ్ రాజ్ బయటే పార్కింగ్ కు ఏర్పాట్లను చేయాలన్నారు. త్రివేణి సంగమం వద్ద ఉన్న అన్ని ఆలయాలను ప్రస్తుతానికి దర్శనాలను రద్దు చేయాలన్నారు.
దీంతో ప్రయాగ్ రాజ్ జంక్షన్ నుంచి భక్తులు 12 కిలోమీటర్లు, సంగం స్టేషన్ నుంచి ఆరు కిలోమీటర్లు, ప్రయాగ్ రాజ్ స్టేషన్ నుంచి ఏడు కిలోమీటర్లు, దరాగంజ్ స్టేషన్ నుంచి మూడు కిలోమీటర్లు, రామ్ బాగ్ స్టేషన్ నుంచి 8 కిలోమీటర్లు. నైనీ స్టేషన్ నుంచి 12 కి.మీ, సుబేదార్ గంజ్ స్టేషన్ నుంచి 15 కి.మీ, ఫఫామావూ స్టేషన్ నుంచి 8 కి.మీ, చివ్ కీ స్టేషన్ నుంచి 16 కి.మీ. మేర భక్తులకు కాలినడక తప్పడం లేదు. మరోవైపు మహాకుంభమేళాలో పుణ్య స్నానాలాచరించిన వారి సంఖ్య సోమవారానికి 45 కోట్లకు పైగా చేరుకుంది.