చల్లారని కార్చిచ్చు.. 10మంది మృతి
10 people died in the fire that was not extinguished
వాషింగ్టన్: అమెరికా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ లో మంటలు (కార్చిచ్చు) ఏ మాత్రం చల్లారడం లేదు. మంగళవారం అటవీ ప్రాంతాల నుంచి ప్రారంభమైన మంటలు లాస్ ఏంజెల్స్ కు ప్రవేశించాయి. శుక్రవారం కూడా మంటలు భారీగా చెలరేగుతున్నాయి. ఈ అగ్నిప్రమాదంలో వివిధ చోట్ల 10 మంది మృతి చెందగా, 10వేల ఇళ్లు కాలిబూడిదయ్యాయి. ఇందులో ప్రముఖుల ఇళ్లు కూడా ఉన్నాయి. హాలీవుడ్ స్టూడియోకు కూడా అగ్నిప్రమాదం ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు వివరించారు. దీంతో హాలీవుడ్ హిల్స్ నుంచి ఈటన్ వరకు మంటలు భారీగా చెలరేగుతుండడంతో అధికారులు ఇళ్లు ఖాళీ చేయించారు. దీనికి తోడు నిరంతరం భారీగా గాలులు వీస్తుండడంతో మంటలు అదుపులోకి రావడం లేదు. అగ్నిమాపక శకటాలు, హెలికాప్టర్ల ద్వారా మంటలను ఆర్పేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈటన్, పాలిసాడ్స్, వెస్ట్ హిల్స్ లాంటి ప్రాంతాల నుంచి పెద్ద యెత్తున ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. మంటలు శుక్రవారం రాత్రి వరకు అదుపులోకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు. కాలిఫోర్నియాలో కార్చిచ్చు కారణంగా ఉప రాష్ర్టపతి కమలా హారీస్ తన విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు. కార్చిచ్చును చల్లార్చేందుకు 900మంది అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఈ ప్రమాదం వల్ల 135–150 బిలియన్ డాలర్ల నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.