చట్టాలను ఎందుకు సంస్కరించలేదు
ఎన్ ఎక్స్ ఈ కాన్ క్లేవ్ లో ప్రధాని మోదీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వెదురు నరికితే కేసులు, పెళ్లిళ్లలో సంబురాలు చేసుకుంటే కేసులు ఇలా అనేక బ్రిటిష్ సమయంలోని చట్టాలను తమ ప్రభుత్వం సంస్కరించిందని ప్రధాని మోదీ తెలిపారు. 75 ఏళ్లుగా ఇలాంటి ఎన్నో చట్టాలపై ఎందుకు మౌనంగా ఉండిపోయారని (కాంగ్రెస్)ను నిలదీశారు. భారత్ జీ–20, ఇతర శిఖరాగ్ర సమావేశాలు ఎన్నింటికో అధ్యక్షత వహించిందని గుర్తు చేశారు. ఎఐ సాంకేతికత, ప్రపంచంలో అతిపెద్ద కాఫీ ఎగుమతిదారు భారత్ అని ప్రధాని పేర్కొన్నారు. శనివారం న్యూ ఢిల్లీలో జరిగిన ఎన్ ఎక్స్ టీ కాన్ క్లేవ్ లో ప్రధానమంత్రి పాల్గొని ప్రసంగించారు.
లుటియన్ గ్రూప్, ఖాన్ మార్కెటింగ్ విని ఆశ్చర్యపోయా..
భారత్ నిర్వహించే సదస్సుల్లో ఎంతోమంది ప్రపంచనలుమూలల నుంచి తరలి వస్తున్నారని, తమదేశ విధానాలపై ఆసక్తిని ప్రదర్శిస్తున్నారని మోదీ హర్షం వ్యక్తం చేశారు. 75 ఏళ్లుగా ఎన్నో పనికిరాని, ఒక వర్గాన్ని అణచివేసే ఆ కాలపు చట్టాల గురించి చెప్పడానికి ఏమీ లేదన్నారు. అందరికీ తెలిసిందే అన్నారు. లుటియెన్స్ గ్రూప్, ఖాన్ మార్కెటింగ్ గ్యాంగ్ ల గురించి విని తాను ఆశ్చర్యపోయానని చెప్పారు. ఎందుకు వీటన్నింటిపై మౌనం దాల్చారని కాంగ్రెస్ పేరెత్తకుండానే నిలదీశారు. ప్రజల స్వేచ్ఛగురించి ఎందుకు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు, ఆదివాసీలు వెదురును తమ అవసరాల నిమిత్తం అడవుల నుంచి నరికితే కూడా వారికి శిక్షలు వేస్తూ వారి హక్కులను కాలరాశారని మండిపడ్డారు. ప్రస్తుతం ఆ చట్టాన్ని కూడా పూర్తిగా తొలగించామన్నారు. ఆదివాసీలు, గిరిజనులకు స్వేచ్ఛనిచ్చామని చట్టాన్ని రద్దు చేశామన్నారు. మహాకుంభమేళాను చూసి నేడు ప్రపంచమే ఆశ్చర్యపోతుందని చెప్పారు.
ప్రపంచశక్తిగా భారత్..
ఫ్రాన్స్ శిఖరాగ్ర సమావేశాలకు భారత్ నాయకత్వం వహించిందని, ఎఐ సమ్మిట్ కు హాజరయ్యే అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో భారత్ కూడా ఇలాంటి సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జీ–20కి అధ్యక్షత వహిస్తూ, మధ్య ప్రాచ్యం యూరప్ ఆర్థిక కారిడార్ బ్లూప్రింట్ ను కూడా సమర్పించామని తెలిపారు. జీ–20లో ఆఫ్రికన్ యూనియన్ దేశాలను సభ్యులుగా చేసి గ్లోబల్ సౌత్ దేశాల స్వరాన్ని పెంచగలిగామని మోదీ చెప్పారు. ఏఐ, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలలో అనేక మార్పులు తీసుకువచ్చామని, నేడు ప్రపంచశక్తిగా భారత్ ఎదుగుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.