ప్రాజెక్టులకు వార్ రూమ్ అనుమతి
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

ముంబాయి: ఆర్థిక వ్యవస్థలకు మూలస్థంభాలైన అభివృద్ధి పనులను నిర్వహించేందుకు, పరిశ్రమలు, కార్యాలయాలు వంటివి మహారాష్ట్రలో ప్రారంభించేందుకు ఇప్పుడు ఎక్కువ సమయం పట్టబోదని, వార్ రూమ్ ద్వారా అన్ని అనుమతులను ఒకేసారి అందజేస్తామని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. గతంలో ఈ పనుల నిర్వహణకు ఉన్న అనేక ఆటంకాలను తొలగించేందుకు ఒకే విధానాన్ని రూపొందించామన్నారు. మహారాష్ట్రను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించి తీరుతామని చెప్పారు. శుక్రవారం ముంబాయిలో జరిగిన ‘టెక్ వీక్ 2025’ ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను పరిశీలిస్తూ టెక్నాలజీ రంగం సహాయంతో అత్యుత్తమ విధానాన్ని రూపొందిస్తామన్నారు. ఎఐ రంగాన్ని కూడా వేగవంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు వార్ రూమ్ ద్వారా అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వివరించారు. గతంలో ఏదైనా ఒక ప్రాజెక్టు ప్రారంభించాలంటే 18 వేర్వేరు ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతులు అవసరం అయ్యేవన్నారు. దీంతో తీవ్ర జాప్యం ఎదురయ్యేదని పేర్కొన్నారు. ప్రస్తుతం అనుమతులన్నీ ఒకేచోట లభించేలా వార్ రూమ్ ద్వారా నిర్ణయాలను తీసుకుంటున్నట్లు వివరించారు. దీంతో మెట్రో, కోస్టల్, అటల్, వాద్వాన్ ఓడరేవు, స్మార్ సిటీ నిర్మాణం, కొత్త వాణిజ్య కేంద్రాల రూపకల్పన, సాంకేతిక అభివృద్ధి వంటి ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పుంజుకోనుందన్నారు. విదర్భ, మరాఠ్వాడాలో కరవు ప్రాంతాకు శాశ్వత నీటి సరఫరా, నదుల అనుసంధానం, వేలాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తాయన్నారు. భవిష్యత్ లో ముంబాయి ఐటీ రంగాన్ని హబ్ గా మార్చి సైబర్ నేరాలను తగ్గిస్తాన్నారు. ముంబాయిలో వాణిజ్య స్థలాల కొరత కారణంగా నవీ ముంబాయి, నవీ థానే, వాధ్వాన్ పోర్టు కొత్త పట్టణ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తామని అన్నారు.