ట్రంప్ దెబ్బ పాక్, బంగ్లా, నేపాల్ విలవిల
Trump's blow to Pakistan, Bangladesh and Nepal

ఆర్థిక సహాయం నిలిపివేతపై ఉత్తర్వులు జారీ
తలపట్టుకుంటున్న షరీఫ్, యూనస్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ట్రంప్ భారత్ లోని మూడు పొరుగు దేశాలకు సహాయం నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాక్, బంగ్లాదేశ్, నేపాల్ కు భారీ ఆర్థిక దెబ్బ తగిలింది. దీంతో ఆ దేశాల్లోని పలు ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకమైంది. ఉత్తర్వుల్లో 90 రోజులలోపు ఆర్థిక సహాయంపై ఆయా దేశాలతో భేటీ అయి నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. దీంతో ఈ దేశాలు వెన్నును ట్రంప్ విరవకనే విరిచారు. ఈ మూడు దేశాలు తమ దేశాల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులపై నిధుల కోసం అమెరికాపైనే ఆధారపడి ఉన్నాయి. 2023లో పాక్ కు 232 మిలియన్ డాలర్లు, బంగ్లాదేశ్ కు 401 మిలియన్ డాలర్లు, నేపాల్ కు 72 మిలియన్ డాలర్లను యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ అందించింది.
పాక్ కు ఎదురు దెబ్బ..
అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ కు ట్రంప్ ఉత్తర్వులు తీరని నష్టాన్ని మిగుల్చనున్నాయి. పాక్ లో నిర్వహిస్తున్న 11 ప్రాజెక్టులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. విద్య, వైద్యం, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల ప్రాజెక్టుల్లో కూడా ఈ నిధులను పాక్ వాడుకుంటుంది. అమెరికా ఆర్థిక సహాయం అందిస్తున్న వరుసలో పాక్ 20వ దేశంగా నిలుస్తుంది. నిధుల నిలిపివేత వల్ల ప్రధాని షాబాజ్ షరీఫ్ సమస్యలు మరింత పెరిగాయి.
బంగ్లా కుదేల్..
పాక్ సైనికులతో కలిసి బీరాలు పోతున్న బంగ్లాదేశ్ కు కూడా ట్రంప్ నిర్ణయం ఇరకాటంలోకి నెట్టింది. ఇప్పటికే ఆందోళనలతో అట్టుడుకుతున్న బంగ్లా ఆర్థిక వ్యవస్థ అంతంతమాత్రంగానే ఉంది. పైగా భారత్ కూడా కఠిన చర్యలు తీసుకోవడంతో ఆర్థిక స్థితి మరింత దిగజారింది. అమెరికా ఉత్తర్వుల జారీతో విద్య, వైద్యం, ఆహార భద్రత, పలు ప్రాజెక్టులపై భారీ ప్రభావం పడనుంది. అమెరికా నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్న దేశాల వరుసలో బంగ్లాదేశ్ 10వ స్థానంలో ఉంది. 2024లో బంగ్లాదేశ్ కు అమెరికా 490 మిలియన్ డాలర్ల సహాయం అందించింది. ట్రంప్ ప్రకటన, ఉత్తర్వుల జారీ తాత్కాలిక ప్రధాని యూనస్ ను ఇరకాటంలోకి నెట్టింది. బంగ్లా ఆర్థికంగా మరింత అస్థిరంగా మారనుంది.
నేపాల్ లో ఆగిపోనున్న ప్రాజెక్టులు..
నేపాల్ కు కూడా అమెరికా పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందజేస్తుంది. 19వ దేశంగా నేపాల్ నిలిచింది. అమెరికా నిధులతో నేపాల్ లోని 21 ప్రాజెక్టులను నిర్వహిస్తున్నారు. 2018–19లో 125 మిలియన్ డాలర్లు, 2020–21లో 105.94 మిలియన్ డాలర్లు ఆర్థిక సహాయాన్ని అందించింది.