శత్రుదేశాలకు ముచ్చెమటలు ట్రంప్–మోదీ భేటీ
Trump-Modi meeting is a threat to enemy countries

చర్చలు ఫలప్రదమే
వీసాలు, ఎఐ, సాంకేతికత, సుంకాలపై కీలక చర్చలకు రెఢీ
డ్రిల్ బేబీ డ్రిల్ కు ఒకే?!
బ్రిక్స్ దేశాల్లో చైనా ఆధిపత్యానికి కత్తెరే!
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుంచి ఆహ్వానం అందింది. ట్రంప్ అధ్యక్షతన తొలిసారి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రెండో సమావేశం జపాన్ ప్రధాని షిగేరు ఇషిభాలతో భేటీ అయ్యారు. మూడోసారి ప్రధాని మోదీ (భారత్)కు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. భారత్ విదేశాంగ విధానంతో శత్రుదేశాలకు ముచ్చెమటలు ఖాయమనే అభిప్రాయాలూ నెలకొన్నాయి. మోదీ–ట్రంప్ మధ్య చర్చలు ఫలప్రదంగా కొనసాగుతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
స్థానిక కరెన్సీపై కీలక చర్చలు..
ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అటు నుంచి అటు అమెరికాకు వెళ్లి ట్రంప్ తో భేటీ కానున్నారు. ఈ భేటీపై ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షిస్తుంది. భారత్ తమ విదేశాంగ విధానంతో ట్రంప్ తో కలిసి ఏ విధమైన ఒప్పందాలను కుదుర్చుకోనుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా భారత అక్రమ వలసలకు బ్రేక్, వాణిజ్య సంబంధాలు, ఆసియా దేశాల్లో చైనా ఆధిపత్యానికి ఎలా చెక్ పెట్టాలి, బంగ్లాదేశ్ లో భారతీయులపై దాడులు, సుంకాలు, రక్షణ రంగంలో సహకారం, ఎఐ (కృత్రిమ మేథస్సు), ఇమ్మిగ్రేషన్ వీసాలు, హెచ్ 1 బీ వీసాలు, బ్రిక్స్ దేశాల్లో చైనా ప్రాబల్యాన్ని తగ్గిస్తూ భారత్ ప్రాబల్యాన్ని పెంచే చర్యలు, ఇంధన రంగంలో సాంకేతిక సహకారం, ఇక చివరిది అత్యంత కీలకమైన స్థానిక కరెన్సీతో వ్యాపార లావాదేవీలు నిర్వహించడంపై ప్రధాని మోదీ, ట్రంప్ లు కీలక చర్చలు జరపనున్నారు.
సాంకేతికతతో చైనాకు చెక్!..
ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టగానే, మెక్సికో, కెనడా, జపాన్, చైనాతోపాటు, భారత్ పై కూడా సుంకాల భారం మోపారు. ఈ భారాన్ని తగ్గించే విధానాన్ని మోదీ నేతృత్వంలోని విదేశాంగ శాఖ ట్రంప్ నకు వివరించనుంది. దీంతో సుంకాల భారం తగ్గనుంది. అదే సమయంలో అమెరికా నుంచి దిగుమతి అవుతున్న వస్తువుల సుంకాలను భారత్ కూడా తగ్గించే అవకాశం ఉంది. రక్షణ విషయంలో యుద్ధ విమానాలు, ఇంజన్లు కొనుగోలు చేసే ఒప్పందం ఖరారు కానుంది. దీంతో రక్షణ రంగంలో అమెరికాకు చెందిన ఉత్పత్తుల కొనుగోలు జోరు కొనసాగి అమెరికా వాణిజ్యంలో సమతుల్యతను సాధించనుంది. ఇక అత్యంత ముఖ్యమైన ఎఐ సాంకేతికతపై కూడా ఇరుదేశాల సహకారం కొనసాగనుంది. డీప్ సీక్ వంటి చైనా రూపొందించిన ఎఐపై ఆందోళన నేపథ్యంలో ఎలన్ మస్క్ తో కలిసి అమెరికా రూపొందించే ఎఐ సాంకేతికతపై ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. దీంతో చైనా డీప్ సీక్ కు చెక్ పెట్టే దిశగా చర్యలు తీసుకోవచ్చు. ఇంధన రంగంలోనూ ఎఐ సాంకేతికతపై చర్చించే అవకాశం ఉంది. ఈ చర్చల్లో ప్రపంచ ప్రముఖ సంస్థలు ఓపెన్ ఎఐ, గూగుల్ వంటి సంస్థల సీఈవోలు, ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కూడా పాల్గొంటారు.
వీసాలపై స్పష్టమైన విధానం..
ట్రంప్ నేతృత్వంలో చమురు, గ్యాస్ రంగంలో అమెరికాను ప్రథమ స్థానంలో నిలబెడతామని చెప్పారు. ఈ నేపథ్యంలో భారత్ అమెరికా నుంచి కూడా నేరుగా చమురు కొనుగోలు చేసే ఒప్పందాని (డ్రిల్ బేబీ డ్రిల్)కి ఒకే చెప్పే అవకాశం లేకపోలేదు. ఇక అత్యధిక సంఖ్యలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల్లో అమెరికా వీసాలపై ఆందోళనలు, అనుమానాలు నెలకొన్నాయి. ట్రంప్–మోదీల మధ్య ఈ విషయంపై చర్చించే అవకాశం ఉంది. భారత్ కు వీసాల విధానంపై సడలింపునిచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బ్రిక్స్ దేశాల్లో చైనా ఆధిపత్య ధోరణిని ఏ విధంగా తగ్గించాలనే దానిపై కూడా అంతర్గత చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇండోపసిఫిక్ విధానంలో భారత్ ను బలపర్చేందుకు ట్రంప్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో చైనాకు చెక్ పెట్టే యోచనలో ఉన్నారు. మొత్తానికి ట్రంప్–మోదీ చర్చలపై ప్రస్తుతానికి ప్రపంచదేశాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా పాక్, చైనా, బంగ్లా లాంటి శత్రుదేశాలకు భారత్ విదేశాంగ విధానంతో ఇరువురి భేటీ ముచ్చెమటలు పట్టించనుంది.