15ఏళ్ల పై బడిన వాహనాలకు ఇంధనం నో!
No fuel for vehicles over 15 years old

ఢిల్లీ మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు
వెల్లడించిన మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా
2025 డిసెంబర్ వరకు విద్యుత్ బస్సులు
ఎత్తైన భవనాలపై స్మోక్ గన్ తప్పనిసరి
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఇకపై ఢిల్లీలో 15ఏళ్ల పై బడిన వాహనాలకు ఇంధనం లభించదు. శనివారం ఢిల్లీ పర్యావరన శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా ప్రకటించారు. 2025 మార్చి 31 తరువాత నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు. రాజధానిలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని అరికట్టే చర్యలపై మంత్రివర్గం సమావేశం నిర్వహించారు. అనంతరం వివరాలను మీడియాకు వెల్లడించారు. వాహనాల ఉద్గారాలు, కాలుష్యం అరికట్టటడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని సిర్సా ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖకు తెలియజేస్తామని చెప్పారు. ఢిల్లీ వ్యాప్తంగా ఎత్తైన భవనాలు, హోటళ్లు, వాణిజ్య సముదాయ భవనాల్లో యాంటీ స్మోగ్ గన్ లను తప్పనిసరి చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. 90 శాతం సీఎన్జీ ప్రభుత్వ ప్రజా రవాణా బస్సులను 2025 డిసెంబర్ నాటికి దశల వారీగా నిలిపివేసి, వాటి స్థానంలో విద్యుత్ బస్సులను తీసుకువస్తామని చెప్పారు. ఢిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు కీలక చర్యలకు ఉపక్రమించామని సిర్సా తెలిపారు. వాయుకాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు, చర్యలకు దిగనుందని చెప్పారు. క్లౌడ్ సీడింగ్ ద్వారా వర్షాలతో కాలుష్యాన్ని నియంత్రించవచ్చా? లేదా? అనే అంశాన్ని నిర్ధరించుకుంటామని మంత్రి సిర్సా చెప్పారు.