కేజ్రీ నామినేషన్ తిరస్కరించాల్సిందే
బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ డిమాండ్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేజ్రీవాల్ అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చాడని వెంటనే ఆయన నామినేషన్ ను తిరస్కరించాలని బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ డిమాండ్ చేశారు. శనివారం కేజ్రీవాల్ నామినేషన్ పై మీడియాతో మాట్లాడారు. ఆర్ ఓ వద్దే కేజ్రీ నామినేషన్ ఆగిపోయిందని ఆరోపించారు. న్యూ ఢిల్లీ నుంచి కేజ్రీవాల్ పోటీ చేస్తున్నారు. ఇదే స్థానం నుంచి ప్రవేశ్ వర్మను బీజేపీ రంగంలోకి దింపింది. ఈ నేపథ్యంలో ఒకరిపై మరొకరు కారాలు, మిరియాలు నూరుకుంటున్నారు. ఆర్ ఓ ముందు కేజ్రీవాల్ పోటీపై తమ అభ్యంతరాలను తెలిపామన్నారు. కేజ్రీవాల్ తన ఆదాయాన్ని 2019–-2020లో రూ. 1,57,823 చూపించారని అన్నారు. ఈ లెక్కల చూసుకుంటే ఆయన ఆదాయం ప్రస్తుతం రూ. 13,152 లక్షలుగా ఉండాలన్నారు. ఓటరు జాబితాలో ఆయన వార్డు, సీరియల్ నెంబర్లు కూడా తప్పుల తడకగా ఉన్నాయన్నారు. యూపీలో నమోదైన ఓటరు ఢిల్లీలో ఎలా పోటీ చేస్తారని నిలదీశారు. నామినేషన్ లో తనపై దాఖలైన కేసుల విషయాలను ఎందుకు దాచిపెట్టారని నిలదీశారు. కేజ్రీవాల్ నామినేషన్ ను పరిశీలించిన ఆర్ ఓ స్టే విధించారని, తిరస్కరించాలని తాను డిమాండ్ చేస్తున్నానని ప్రవేశ్ వర్మ స్పష్టం చేశారు.