జీడీపీ వృద్ధి 6.2 శాతానికి పెరుగుదల
ఆర్థిక శాఖ నివేదిక వెల్లడి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: స్టాక్ మార్కెట్లపై బేర్ దాడులు కలవర పరుస్తున్నా 2024 డిసెంబర్ నాటికి జీడీపీ వృద్ధి 6.2 శాతంగా పెరిగింది. అదే సంవత్సరం జూలై–సెప్టెంబర్ త్రైమాసికం వద్ద 5.6 శాతంగా నమోదైనట్లు శుక్రవారం ఆర్థిక శాఖ నివేదిక వెల్లడించింది. పూర్తి సంవత్సరం విషయానికి వస్తే 6.5 శాతంగా వృద్ధి కొనసాగినట్లు వెల్లడించింది. 2025లో ఊహించినదాని కంటే వృద్ధి గణనీయంగా ఉంటుందని ఆశిస్తుంది. ఓ వైపు తయారీ రంగం నిదానంగా సుస్థిరతను కొనసాగిస్తున్నప్పటికీ వ్యవసాయ రంగం, సేవా రంగాలు పుంజుకున్నాయి. గత త్రైమాసికంలో వ్యవసాయ రంగం 4.1 శాతం నుంచి 5.6 శాతానికి వృద్ధిని సాధించింది. తయారీ రంగం 2.1 శాతం నుంచి 3.1 శాతానికి పెరిగినప్పటికీ అంతకుముందుతో పోల్చుకుంటే తగ్గుదలను సూచిస్తుంది. సేవా రంగం 7.2 శాతం నుంచి 7.4 శాతం స్వల్ప వృద్ధిని కనబరిచింది. మూలధనం వ్యయం 5.8 శాతం నుంచి 5.7 శాతానికి తగ్గింది. రూ. 10.2 లక్షల కోట్ల మూలధన వ్యయంలో 74.4 శాతాన్ని మాత్రమే ప్రభుత్వం ఉపయోగించుకుంది. మొత్తానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు 6.5 శాతం మార్కకును సులభంగానే చేరుకోవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. కాగా 2025–26 లో 6.6 శాతం వృద్ధిని అంచనా వేశారు. ద్రవ్య సడలింపులు, ప్రతికూలతలు ఉన్నప్పటికీ వృద్ధి రేటును కొనసాగించడంలో ప్రతిబంధకాలను అధిగమించే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
........