మోదీని ఓడించేందుకు విదేశీ నిధులు
రాహుల్ గాంధీపై బీజేపీ నేత గౌరవ్ భాటియా మండిపాటు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని పదవీచ్యుతుడిని చేసేందుకు భారత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి అమెరికన్ సహాయ నిధులు (యూఎస్ ఎఐడీ–యూఎస్ స్టేట్స్ ఏజెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్–జార్జ్ సోరోస్) ఉపయోగించారని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలపై శుక్రవారం బీజేపీ నేత గౌరవ్ భాటియా కాంగ్రెస్, రాహుల్ గాంధీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. విదేశీ సంస్థలు మనదేశ ఎన్నికల ప్రక్రియలో జోక్యం ఎందుకు చేసుకున్నాయని రాహుల్ చెప్పాలని నిలదీశారు. పదేపదే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు స్పష్టం అవుతుందన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశాన్ని అస్థిరపరిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. దేశంలో ఆర్థిక, రాజకీయ స్థిరత్వాన్ని కాంగ్రెస్ కోరుకోవడం లేదన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన కాంగ్రెస్ కు మోదీ ప్రభుత్వ విజయం ఆకళింపు కావడం లేదని మండిపడ్డారు. మోదీతోపాటు దేశ ప్రజలను కూడా వ్యతిరేకిస్తున్నారన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. 21 మిలియన్ డాలర్ల సహాయాన్ని పొందిన వారు తమకు సంబంధం లేదని తప్పించుకోజూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం జార్జ్ సోరోస్ లాంటి దేశ విచ్ఛిన్న శక్తులతో చేతులు కలిపిందని స్పష్టం అవుతుందన్నారు. జార్జ్ సోరోస్ కాస్త గాంధీ సోరోస్ గా మారిందని ఆరోపించారు. మోదీని ఎన్నికల్లో ఓడించేందుకు రాహుల్ యూఎస్ కాంగ్రెస్ మహిళ ఇల్హాన్ ఒమర్ ను కూడా కలిశారన్నారు. చైనా కమ్యూనిస్టులతో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఈ ఒప్పందం వివరాలు కూడా త్వరలోనే బయటపెడతామన్నారు. శ్యామ్ పిట్రోడాకు చైనా చాలా మంచి మిత్రదేశమని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ కూడా ప్రధాని మోదీని ఓడించేందుకు పాక్ సహాయం కోరారని విమర్శించారు.