ఓరుగల్లు కోటపై బీజేపీ విజయ బావుటా!

గెలుపు దిశగా కమలం పార్టీ అభ్యర్థి ఆరూరి – సొంత పార్టీలో విభేదాలతో వెనుకబడ్డ కాంగ్రెస్​ అభ్యర్థి కావ్య – ఉనికి కోసం బీఆర్​ఎస్​ అభ్యర్థి సుధీర్​ కుమార్​ ప్రయత్నం – వరంగల్​ ఎంపీ స్థానంలో బీజేపీ వర్సెస్​ కాంగ్రెస్​ – కాషాయ జెండా ఎగరడం ఖాయమన్న జన్​ లోక్​ పోల్​ సర్వే – కాజీపేటకు వ్యాగన్​ మ్యానుఫ్యాక్చరింగ్​ యూనిట్​ ఇచ్చిన మోదీ – రామప్పకు యునెస్కో గుర్తింపు కృషి చేసిన బీజేపీ సర్కారు – ములుగులో కేంద్ర గిరిజిన విశ్వవిద్యాలయం ఏర్పాటు – పీఎం మిత్రలో మెగా టెక్స్​ టైల్​ పార్కు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటన – నరేంద్ర మోదీకే తమ ఓటు అంటున్న ఓరుగల్లు ప్రజలు

Apr 18, 2024 - 17:19
 0
ఓరుగల్లు కోటపై బీజేపీ విజయ బావుటా!

ఉద్యమాల ఖిల్లా ఓరుగల్లు.. తెలంగాణ రాష్ట్రానికి ఓ పోరు సైరన్. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరమే! దేశానికి ప్రధానిని అందించిన ఘనత ఈ జిల్లాదే. పోరాటలకు నెలవు అయిన ఈ ప్రాంతంలో విలక్షణమైన రాజకీయాలు కొనసాగుతూ వచ్చాయి. ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొన్నది. వరంగల్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్​ఎస్​ అభ్యర్థులు మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్నవారే కావటం గమనార్హం. వరంగల్​ లోక్​ సభ స్థానం పరిధిలో స్టేషన్‌ఘన్‌పూర్(ఎస్సీ), వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పాలకుర్తి, వర్ధన్నపేట(ఎస్సీ), పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య దాదాపు17 లక్షలు. 2019లో 10 లక్షల 61 వేల 645 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1952లో తొలిసారిగా వరంగల్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగ్గా.. అప్పుడు ఇక్కడ పీడీఎఫ్ అభ్యర్థి పెండ్యాల రాఘవరావు విజయం సాధించారు. ఈ లోక్‌సభ స్థానానికి17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2008, 2015లో రెండు సార్లు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ సీటులో అత్యధికంగా ఎనిమిది సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా.. ఆ తర్వాత టీడీపీ, బీఆర్ఎస్ సత్తా చాటాయి. 2014 నుంచి ఈ సీటును బీఆర్‌ఎస్  గెలుచుకుంటున్నది. 2019లో ఈ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ విజయం సాధించారు.

అభ్యర్థులు వీరే.. 

వరంగల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు అభ్యర్థులు కూడా పార్లమెంట్ బరిలో తొలిసారిగా పోటీ చేస్తున్నారు.  ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి కడియం కావ్య, బీజేపీ నుంచి ఆరూరి రమేశ్‌, బీఆర్ఎస్ నుంచి మారేపల్లి సుధీర్‌కుమార్‌ పోటీ చేస్తున్నారు. వరంగల్‌ నుంచి పోటీ చేసేందుకు అన్ని పార్టీలకన్నా ముందు బీఆర్ఎస్  అభ్యర్థిగా కడియం శ్రీహరి బిడ్డ  కావ్యను ప్రకటించినా.. తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది.  వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ బీఆర్ఎస్ ను వీడి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.  స్టేషన్‌ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే రాజయ్య మళ్లీ బీఆర్ఎస్ లో చేరుతున్నారని, బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటారనే ప్రచారం సాగినా.. చివరవకు  వివాదరహితుడిగా పేరున్న జడ్పీ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ను బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. డాక్టర్‌ మారేపల్లి సుధీర్‌కుమార్‌ ఆయుర్వేద వైద్యుడు కాగా.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన డాక్టర్‌ కడియం కావ్య సైతం వైద్యురాలే.. ఎంబీబీఎస్‌, ఎండీ పాథాలజీ పూర్తి చేసి కొన్నాళ్లు వర్ధన్నపేటలో అనంతరం హనుమకొండలోని ప్రతిమ రిలీఫ్‌ మెడికల్‌ కళాశాలలో వైద్యురాలిగా పనిచేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇక బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్‌ గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఇప్పుడు లోక్‌సభకు పోటీచేసేందుకు కమలం నుంచి అవకాశం దక్కించుకున్నారు.. ప్రధాన పార్టీల తరఫున ప్రత్యర్థులుగా తలపడున్న అందరూ గతంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. 

గురుశిష్యుల పోరు.. 

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరి,- ఆరూరి రమేశ్​ మంచి గురుశిష్యులని చెప్పుకుంటారు. టీడీపీలో ఉన్నన్ని రోజులు స్టేషన్ ఘనపూర్ నుంచి కడియం శ్రీహరి గెలుపునకు ఆరూరి రమేష్ సహకరిస్తే.. వర్ధన్నపేట నియోజకవర్గంలో ఆరూరి రమేష్ విజయం కోసం కడియం శ్రీహరి శ్రమించారంటారు.  20 ఏళ్ల పాటు వీరిమధ్య బంధం- అనుబంధం – ఒక్కసారిగా వైరంగా మారింది. గురు శిష్యులు కాస్త ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులయ్యారు. కడియం శ్రీహరి సహకారంతో ఆరూరి రమేశ్​ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొందితే, ఆరూరి సహకారంతో కడియం శ్రీహరి ఉపముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని వరంగల్ లో వినిపించే మాట.. వర్ధన్నపేట నుంచి కూతురు కడియం కావ్యను బరిలోకి దింపాలన్న వ్యూహంతోనే  కడియం శ్రీహరి చాలా రోజులుగా ఆరూరి రమేశ్​ కు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనేది ఆరూరి వర్గం చేస్తున్న ఆరోపణ. 2023 ఎన్నికల్లో  వర్ధన్నపేట నుంచి పోటీ చేసిన ఆరూరి రమేశ్​ ఓటమిపాలు కావడం శ్రీహరి కుట్రగా చెప్పుకుంటారు. కూతురిని వర్ధన్నపేట నుంచి బరిలో దించేందుకు కడియం శ్రీహరి చేసిన ప్రయత్నాలు- గురుశిష్యుల మధ్య విభేదానికి కారణమయ్యాయని నియోజకవర్గంలో ప్రచారం నడుస్తున్నది. 2023 ఎన్నికల్లో ఆరూరి రమేశ్‌ను ఓడించడంలో అదీకాకుండా, ఎంపీగా బరిలో నిలవాలని భావించిన ఆరూరి రమేశ్‌కు చెక్ పెట్టే ప్రయత్నం కూడా కడియం చేశారని రమేశ్​ వర్గం అంటోంది. అందుకే ఆరూరి బీఆర్‌ఎస్‌ని వీడి బీజేపీలో చేరడం .. ఇదే సమయంలో కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ ను వీడి..  కూతురు రాజకీయ జీవితం కోసం కాంగ్రెస్‌లో చేరారు. కావ్యకి వరంగల్ ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు. ఆరూరి రమేశ్ కూడా బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ గా పోటీ చేస్తుండటంతో ఒకేపార్టీలో ఉన్న గురు-శిష్యులు వేర్వేరు పార్టీల్లోకి వెళ్లి ప్రత్యర్థులుగా మారారు.. దీంతో తెలంగాణలో జరుగుతున్న రవసత్తర పోరులో వరంగల్ ఒకటిగా నిలుస్తోంది. 

ఆరూరికి ప్రజాబలం

బీజేపీ నుంచి బరిలోకి దిగి ప్రచారంలో దూసుకెళ్తున్న ఆరూరి రమేశ్​ కు ప్రజాబలం ఎక్కువగా కనిపిస్తున్నది. రాజకీయాల్లో అనుభవం, ప్రజలకు సుపరిచిత నేత కావడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రజలు ఆమోదిస్తున్నారు. రేపటి తెలంగాణ భవిష్యత్ ను మార్చేది వరంగల్ లో బిజెపి సాధించే విజయమేనంటూ ఓటర్లకు చెబుతూ ప్రచారాన్ని మరో మెట్టు ఎక్కిస్తున్నారు ఆరూరి రమేశ్. వరంగల్ స్థానం గెలిచి ప్రధాని నరేంద్ర మోదీకి కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తకు ఉందంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరిని కలుస్తూ.. ఈ విజయంలో వారి భాగస్వామ్యం కోరుతూ ..  ప్రతి బూత్ లోని లబ్ధిదారులను నేరుగా కలుస్తున్నారు. మోదీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి వివరిస్తూ బీజేపీకి ఓటు వేయాలని కోరుతున్నారు. బీజేపీ విజయంతో వరంగల్​ పార్లమెంట్​ పరిధిలోని ఆయా నియోజకవర్గాలు వాణిజ్యపరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని భరోసా ఇస్తున్నారు. ఓపెన్ కాస్ట్ నిర్వాసితులకు నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రయత్నాలు ఆపనని ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై బీజేపీ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిస్తున్నారు. పేదలకు ఆప్తుడిగా, సమస్యలపై పోరాడే మాస్​ లీడర్​ గా ఆరూరిక ప్రజల్లో గుర్తింపు ఉన్నది. రాష్ట్రంలో మోదీ మేనియా.. వరంగల్​ పార్లమెంట్​ నియోజకవర్గంలో మిగతా అభ్యర్థుల కన్నా వ్యక్తిగతంగా ఆరూరికి ఉన్న ప్రతిష్ట ఆయనను విజయతీరాలకు చేర్చుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్వేల్లోనూ బీజేపీ ఇక్కడ ముందు ఉన్నది. ఇటీవల విడుదలైన జన్​ లోక్​ పోల్​ సర్వేలో ఆరూరిదే విజయమనే అభిప్రాయం వెల్లడైంది. 

కాంగ్రెస్​ అభ్యర్థికి కష్టాలు..

కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్యకు టికెట్​ అయితే ఈజీగానే వచ్చింది కానీ.. గెలుపు మాత్రం కష్టంగానే కనిపిస్తున్నది. ఆమెకు గతంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోవడం, ఆమె స్థానికతపైనా విమర్శలు రావడంతో నానాటికీ ఆమె గెలుపు అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. ఆమె తన తండ్రి కడియం శ్రీహరి రాజకీయ అనుభవాన్ని నమ్ముకుని బరిలోకి దిగారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మాజీ మంత్రి కడియం శ్రీహరి.. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమెకు బీఆర్​ఎస్​ పార్టీ టికెట్​ ప్రకటించిన తర్వాత.. ఆమె ఆ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేయడం, వెంటనే పార్టీ మారడం.. ఆ వెంటనే కాంగ్రెస్​ టికెట్​ ఖరారు కావడం చకచకా జరిగిపోయాయి. కడియం శ్రీహరి నేతృత్వంలో జరిగిన ఈ ఎపిసోడ్​ ఆమెకు ప్రజాక్షేత్రంలో డ్యామేజ్​ చేసింది. ఎమ్మెల్సీగా తన తండ్రి బీఆర్​ఎస్​ లో పదవులు అనుభవించి, స్టేషన్​ ఘన్​ పూర్​ ఎమ్మెల్యే టికెట్​ పొంది, తీరా గెలిచాక పార్టీ మారడంపై గులాబీ కేడర్​.. కడియంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అటు కాంగ్రెస్​ పార్టీ కేడర్​ కూడా కడియం రాకను హర్షించడం లేదు. ఆయనతోపాటు ఆయన వెంట కాంగ్రెస్​ లోకి వచ్చే బీఆర్​ఎస్​ నాయకులను కాంగ్రెస్​ కార్యకర్తలు బహిరంగంగానే అడ్డుకుంటున్నారు. ఇటీవల జనగామ జిల్లా నెల్లుట్లలో చేరికల సందర్భంగా పెద్ద ఎత్తున గొడవ జరగడం చర్చనీయాంశమైంది. అటు పరకాలలోనూ రేవూరి వర్గం, కొండా వర్గం మధ్య విభేదాలు ఇటీవల బయటపడ్డాయి. అటు పార్టీ బలంగా లేకపోవడం, ఇటు వ్యక్తిగతంగా కడియం కావ్య బలమైన అభ్యర్థి కాకపోవడంతో ఆమె గెలుపు కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహమ్మద్‌ నజీరుద్దీన్‌ను  పెండ్లి చేసుకొని గుంటూరు వాస్తవ్యురాలైన మహమ్మద్‌ కావ్య నజీరుద్దీన్‌కు వరంగల్‌ ప్రజలు ఎందుకు ఓటేయాలని బీజేపీ వరంగల్‌ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్‌ సంధించిన ప్రశ్న.. కడియం కావ్యను ఇరకాటంలో పడేయడమేగాక.. జనాల్లోనూ ఆలోచన రేకిత్తించింది. 

బీఆర్​ఎస్​ అభ్యర్థి..

బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ సుధీర్ కుమార్ తొలిసారిగా ఎంపీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. 2019లో జరిగిన జిల్లా పరిషత్తు ఎన్నికల్లో ఎల్కతుర్తి జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొంది హనుమకొండ జడ్పీ చైర్మన్ గా అవకాశం దక్కించుకున్నారు. అయితే ఉమ్మడి వరంగల్​ జిల్లాలో గులాబీ పార్టీ మెజార్టీ స్థానాల్లో ఓడిపోవడం, పార్టీ కేడర్​, స్థానిక నాయకత్వం మొత్తం ఇతర పార్టీలోకి ఫిరాయించడంతో బీఆర్​ఎస్​ పార్టీ బలం తగ్గింది. ఈ నేపథ్యంలో సుధీర్​ కుమార్​ గెలుపు అంత సులువు కాదు. పార్టీ ముఖ్యనేతలు సభలు, సమావేశాలు నిర్వహించి కొంత ఉత్సాహం నింపుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆయనకు సరిపోయే బలం లేదు. దీంతో ఈ ఎన్నికల్లో కారు పార్టీ మూడో స్థానానికే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

వరంగల్ కు మోదీ ఇచ్చిన  నిధులు..

ప్రధాని నరేంద్ర మోదీ గత పదేండ్లలో వరంగల్​ కు నిధులు మంజూరు చేయడంతోపాటు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు మంజూరు చేశారు. ములుగు జిల్లాకు కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేయడం, కాజీపేటకు రైల్వే వ్యాగన్​ మ్యానుఫ్యాక్చరింగ్​ యూనిట్​ మంజూరు చేయడం, రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చేందుకు కృషి చేయడం వరంగల్​ కోట, వెయ్యి స్తంభాల గుడి అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు. వరంగల్​ మీదుగా హైవేలను అభివృద్ధి చేశారు. లక్నవరం టూరిజం సర్క్యూట్​ కు నిధులు ఇచ్చారు. తెలంగాణకు మరో మెగా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లక్షలాది మంది రైతులు, చేనేత కార్మికులకు మేలు చేసే, వేలాది మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే పీఎం మిత్ర మెగా టెక్స్ టైల్ పార్క్ ను వరంగల్​ లో ఏర్పాటు చేస్తామని మోదీ ప్రకటించారు. వీటితోపాటు  ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా వరంగల్  నియోజకవర్గానికి రూ.167.48  కోట్ల ఖర్చుతో 9, 701 ఇండ్లను కేటాయించింది నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం. రూ.131.87 కోట్ల నిధులు విడుదల కాగా.. ఇప్పటివరకు 7,748 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. అమృత్ పథకంలో భాగంగా అటల్ మిషన్ పట్టణ పునరుద్ధరణ కింద రూ.544.85 కోట్లతో నియోజకవర్గంలోని పట్టణ కేంద్రాలను అభివృద్ధి చేసింది. అమృత్ 2.0 లో రూ.115.69 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి కోసం అభివృద్ధి పనులకు  ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద నియోజకవర్గంలోని 75,161 మందికి రూ.99.15 కోట్ల రుణసదుపాయం కల్పించింది మోదీ ప్రభుత్వం. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన అమలులో భాగంగా పట్టణ జీవనోపాధి మిషన్ కింద 2,803 స్వయం సహాయక సంఘాల ద్వారా నియోజకవర్గంలోని11,751 మందికి బ్యాంక్ రుణాలతో జీవనోపాధి మెరుగు పరిచింది కేంద్ర ప్రభుత్వం.. అంతేకాదు మరో 2,437 మందికి ఉపాధి శిక్షణ అందించింది.  స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కార్పొరేషన్ లో మౌలిక సదుపాయాల కల్పించేందుకు రూ.1,616 కోట్ల ఖర్చుతో 81 అభివృద్ధి పనులకు నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే రూ.1,266 కోట్లు ఖర్చు చేసి 56  పనులు పూర్తి చేసింది.