ఈ శ్రమ్ లో 1.23 కోట్ల నూతన రిజిస్ట్రేషన్ లు
ఇప్పటివరకు 30.58 కోట్ల మంది చేరిక

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఈశ్రమ్ పోర్టల్ లో 2024లో 1.23 కోట్ల కొత్త రిజిస్ర్టేషన్‌లతో పేర్లు నమోదు చేసుకున్న కార్మికుల సంఖ్య 30.58 కోట్లకు చేరిందని సమగ్ర జాతీయ అసంఘటిత కార్మికుల డేటాబేస్ (ఎన్ డీయూడబ్ల్యూ) వెల్లడించింది. ఈ సంస్థ కార్మికులకు పీఎఫ్ అకౌంట్ కోసం యూఎఎన్ నెంబర్ ను (యూనివర్సెల్ ఐడెంటిటీ నంబర్)ను అందజేస్తుంది. నివేదిక సమాచారాన్ని మంగళవారం కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. సగటున రోజువారీ నమోదులు 33,700 ఉన్నట్లు తెలిపారు. ఈశ్రమ్ పోర్టల్ ద్వారా కార్మికుల కోసం అనేక రకాల సదుపాయాలను కల్పించారు. ఈ పోర్టల్ ద్వారా ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్-ధన్ (పీఎం ఎస్ వైఎం) – 60 సంవత్సరాల వయస్సు తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ అందించే పెన్షన్ పథకం. కార్మికులను నమోదు చేసేందుకు రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో ఈ సంస్థ డేటాను పంచుకుంటుంది. అదే సమయంలో కార్మికులకు నైపుణ్య శిక్షణ, అప్రెంటిస్ షిప్ అవకాశాల కోసం డిజిటల్ ఫ్లాట్ ఫామ్ తో అనుసంధానిస్తారు. ఈ పోర్టల్ ద్వారా కార్మికుల అర్హతలకు అనుగుణంగా వివిధ ప్రభుత్వ పథకాలను పొందొచ్చు.2024 అక్టోబర్ 21న మంత్రిత్వ శాఖ అసంఘటిత కార్మికుల కోసం ‘వన్ స్టాప్ సోల్యూషన్’ అనే ఈ శ్రమ్ ను కూడా ప్రారంభించింది. ఇది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఆయుష్మాన్ భారత్, ఎంజీఎన్ఆర్ఈజీఎ లాంటి 12 కేంద్ర ప్రభుత్వ పథకాలను ఏకీకృతం చేసింది. దీంతో కార్మికులకు సామాజిక, ఆర్థిక, ఆరోగ్య భద్రత లభిస్తుంది.