సాగరం మరింత భద్రం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Jan 15, 2025 - 13:17
 0
సాగరం మరింత భద్రం

ముంబాయి నావల్​ డాక్​ లో మూడు యుద్ధ నౌకల ప్రారంభం

ముంబాయి: సాగరంలో సురక్షితంగా, మరింత పరాక్రమవంతంగా రూపుదిద్దుకోవడం దేశానికి గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం ముంబాయి నావల్ డాక్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మూడు యుద్ధ నౌకల (ఐఎన్‌ఎస్ సూరత్ (డిస్ట్రాయర్), ఐఎన్‌ఎస్ నీలగిరి (స్టెల్త్ ఫ్రిగేట్), ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్ (సబ్‌మెరైన్)ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం జరిగిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. 

భద్రత, అభివృద్ధి మరింత చేరువ..
జలాంతర్గాములను ప్రారంభించే అదృష్టం తనకు దక్కడం సంతోషకరమన్నారు. ఈ నౌకల ప్రారంభంతో సముద్రపు సరిహద్దుల్లో అందరికీ భద్రత, అభివృద్ధి అనేవి మరింత చేరువయ్యాయని, సురక్షితమయ్యాయన్నారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకటే భవిష్యత్​ అని తాను జీ–20లో కూడా తెలిపానన్నారు. భారత్​ పై ప్రపంచానికి నమ్మకం పెరిగిందని, మన నేవీ వందలాది మంది ప్రాణాలను కాపాడిందన్నారు. వేలకోట్ల విలువైన జాతీయ, అంతర్జాతీయ కార్గోకు రక్షణ కల్పిస్తుందన్నారు. కోస్ట్​ గార్డులపై ప్రపంచం నమ్మకం మరింత పెరిగిందన్నారు. ఆసియా, ఆస్ట్రేలియా, గల్ఫ్, ఆఫ్రికన్ దేశాల్లో భారత్​ ఆర్థిక సహకారం నిరంతరం బలపడుతూనే ఉందన్నారు. పదేళ్లలో 33 నౌకలు, ఏడు జలాంతర్గాములు నావికాదళంలోకి చేర్చగలిగామన్నారు. ఇందులో 39 పూర్తి దేశీయ షిప్​ యార్డుల్లోనే నిర్మితమయ్యాయని తెలిపారు.

యూపీ, తమిళనాడుల్లో డిఫెన్స్​ కారిడార్లు..
మేక్​ ఇన్​ ఇండియా మంత్రంతో దేశంలో అతిపెద్ద హెలికాప్టర్ల తయారీ ఫ్యాక్టరీ కర్ణాటకలో ప్రారంభమైందని, యూపీ, తమిళనాడుల్లో  నిర్మిస్తున్న డిఫెన్స్ కారిడార్ పనులు మరింత ఊపందుకున్నాయని వివరించారు. ఇక నుంచి ఐదువేల రక్షణ పరికరాలను దిగుమతి చేసుకోమని తెలిపారు. పూర్తి దేశీయంగానే వీటిని తయారు చేసుకుంటున్నామని తెలిపారు. దేశీయంగా అత్యున్నత సాంకేతికత, విశ్వాసాలతో ముందుకు వెళ్లడం గర్వకారణమన్నారు. జనవరి 15వ తేదీని ఆర్మీ డేగా కూడా జరుపుకుంటున్నట్లు మోదీ తెలిపారు. భారతదేశ సముద్ర వారసత్వ నావికాదళం అద్భుతమైన చరిత్రకు, స్వావలంబన భారతదేశ ప్రచారానికి కూడా ఈ రోజు ఎంతో ప్రత్యేకమైన రోజన్నారు. 

ఛత్రపతి నౌకాదళానికి మరింత బలం..
ఛత్రపతి శివాజీ నౌకాదళానికి కొత్త బలాన్ని, కొత్త దృష్టిని అందించారని తెలిపారు. 21వ శతాబ్దపు నావికాదళాన్ని వారి ఈ పుణ్యభూమిలో బలోపేతం చేసే దిశగా నేడు మనం పెద్ద అడుగు వేశామని తెలిపారు. డిస్ట్రాయర్, ఫ్రిగేట్, జలాంతర్గామి కలిసి కమీషన్ చేయడం ఇదే తొలిసారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 

ఐఎన్​ఎస్​ నీలగిరి (స్టీల్త్ ఫ్రిగేట్): ఇది పీ–17ఎ స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్ట్ తొలినౌక. ఈ డిజైన్‌ను ఇండియన్ నేవీకి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో తయారు చేసింది. ఇందులో అధునాతన సాంకేతికతను వాడారు. భవిష్యత్​ లో పూర్తి స్వదేశీయంగానే ఈ తరహా యుద్ధ నౌకలను తయారు చేయనున్నారు. సముద్రంలో ఎక్కువ సమయం ఉండగలిగే సామర్థ్యం దీని సొంతం. దీనిపై నుంచి చేతక్, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్, ఎంహెచ్​ 60 ఆర్​ హెలికాప్టర్‌లను వీటిపై మోహరించనున్నారు. ఇందులో ఆధునాతన సెన్సార్లు, ఆయుధాలను నిల్వ చేసే సామర్థ్యం ఉంది.

ఐఎన్​ ఎస్​ సూరత్ (డిస్ట్రాయర్): ఇది పీ–15బీ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్ట్ నాలుగో, చివరి నౌక. ప్రపంచంలోనే అతిపెద్ద డిస్ట్రాయర్లలో ఒకటి. ఈ యుద్ధ నౌకను దేశీయంగా రూపొందించారు. ఆధునాతన నెట్‌వర్క్, అధునాతన ఆయుధ సెన్సార్ ప్యాకేజీతో అమర్చారు. 

ఐఎన్​ఎస్​ వాగ్​ షీర్​(సబ్ మెరైన్): పీ 75 స్కార్పెన్​ ప్రాజెక్ట్​. కల్వరికి చెందిన ఆరవ, చివరి జలాంతర్గామి. ఈ సబ్​ మెరైన్​ నిర్మాణంలో ఫ్రెంచ్​ నేవీ గ్రూప్​ సహాయం తీసుకున్నారు. ప్రపంచంలోని అత్యంత నిశ్శబ్ద, బహుముఖ డీజిల్-ఎలక్ట్రిక్ జలాంతర్గాములలో ఒకటి. యాంటీ-సర్ఫేస్ వార్‌ఫేర్, యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్, వైర్-గైడెడ్ టార్పెడోలు, యాంటీ షిప్ క్షిపణులు, అధునాతన సోనార్ సిస్టమ్‌లను ఈ సబ్​ మెరైన్ లో ఏర్పాటు చేశారు. 

భారత నేవీ వద్ద సబ్​ మెరైన్లు–16, ఎయిర్​ క్రాఫ్ట్​ క్యారియర్లు–2, డిస్ర్టాయర్లు–10, ఫ్రీగేట్​–9, క్వార్ట్స్​ –12 ఉన్నాయి.