మెటా అండర్ సీ కేబుల్ ప్రాజెక్ట్
డిజిటల్ సేవలకు మరింత ఊతం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్ – అమెరికాల మధ్య గ్లోబల్ డిజిటల్ హైవే నిర్మాణం, కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మార్క్ జుకర్ బర్గ్ సంస్థ వంద కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతుంది. ట్రంప్–మోదీల మధ్య సమావేశం తరువాత మెటా ఈ నిర్ణయం తీసుకుంది. కనెక్టివిటీ కోసం మెటా సముద్ర గర్భంలో కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 50వేల కి.మీ. పొడవైన కేబుల్ ను వేయనున్నారు. హిందు మహాసముద్రంలో ఈ కేబుల్ ద్వారా భారత్–అమెరికాల మధ్య కనెక్టివిటీని మెరుగుపర్చనున్నారు. అండర్ సీ కేబుల్ ప్రాజెక్టు ఐదు ఖండాల మీదుగా కొనసాగనుంది. పెరుగుతున్న డిజిటల్ సేవలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెటా సంస్థ అధికారులు తెలిపారు. దీంతో సూపర్ ఫాస్ట్ డేటా బదిలీకి సహకారం అందనుంది. భారత్ లో మెటాఫ్లాట్ ఫారమ్ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ లకు మిలియన్ల మంది వినియోగదారులున్నారు. ఈ నేపథ్యంలో సేవలను మరింత మెరుగుపర్చుకోవాలని సంస్థ భావిస్తూ ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేయాలని నిర్ణయించింది.