హస్తానికి ఒక్కటేనా? ‘0’నా!
Congreaa 1 or 0?

ఆప్–కాంగ్రెస్ ల పొత్తును తిరస్కరించిన ఢిల్లీవాసులు
పార్లమెంట్ ఎన్నికల్లోనే కమల విజయం సునాయాసమేనని ఋజువు
ఉచిత హామీలతో గట్టెక్కాలని కేజ్రీ ప్రయత్నం
విసిగి వేసారి తిప్పికొట్టిన ఓటర్లు
పనిచేసిన మోదీ మేనియా
మైనార్టీలూ బీజేపీ వైపే: సాజిద్ రషీద్
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: అంత పొడవు, ఇంత పొడవు అనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ ప్రజలు ఇచ్చిన ఝలక్ మామూలుది కాదు. కనివినీ ఎరగదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ లో కేవలం ఒక్కటంటే ఒక్కటే సీటును సాధిస్తుందని ప్రకటించడం పట్ల ఆ పార్టీ హై కమాండ్ నాయకులకూ మింగుడుపడని విధంగా ఉంది. ఇక్కడే అంచనాలు తారుమారై ‘0’కు దిగజారినా ఆశ్చర్యం లేదు. మరోవిధంగా చెప్పాలంటే దేశరాజధానిలో హస్తం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కాగా భారీగానే ముస్లిం ఓటు బ్యాంకును కలిగి ఉన్న కాంగ్రెస్ ఇంత ఘోరమైన పరిస్థితికి కారణాలు అనేకం ఉన్నాయనే వాదన వినవస్తుంది.
ఓటు బ్యాంకు చీల్చే యత్నం.. మొదటికే మోసం..
గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ – ఆప్ తో జతకట్టడం. అయినా ఏడు స్థానాల్లో ఒక్క స్థానాన్ని కైవసం చేసుకోలేకపోవడంతోనే రాజకీయ విశ్లేషకులకు పూర్తి అంచనా వచ్చేసింది. ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే అనుకూలమైన తీర్పు ఇవ్వనున్నారనేది తెలిసిపోయింది. ఇది గమనించిన ఆప్–కాంగ్రెస్ లు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి రంగంలోకి దిగితే నష్టం తప్పదని భావించి, ఇరుపార్టీలు వేర్వేరుగా బీజేపీ ఓటు బ్యాంకును చీల్చాలనే లక్ష్యంతో రంగంలోకి దిగాయి. కానీ వీరి ఆశలన్నీ గల్లంతై అక్కడ కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా భారీగానే బీజేపీ వైపు మళ్లింది. ఆప్ అధినేత మనిషి పుట్టుక నుంచి చచ్చేవరకు పనిచేయనవసరం లేదన్నట్లు ఉచితాల పేరుతో సంక్షేమ పథకాలను ప్రకటించిన ఢిల్లీ ప్రజలు వాటిని ఏ మాత్రం విశ్వసించలేదు. ముఖ్యంగా నిరుపేదలు గత 11 ఏళ్లుగా ఆప్ అధినేత మాటలు వింటూ వింటూ విసిగి వేసారిపోయారు. అదీగాక అన్నా హజారే నిజాయితీ ఆదర్శాలను పక్కన పెట్టి మద్యం కుంభకోణం, విద్య, వైద్యం, శీష్ మహల్ లాంటి అవినీతి, అక్రమాలకు తెరతీశారు. ఈ విషయాలు కూడా సగటు నిరుపేదల మనసుల్లో నాటుకుపోయాయి. మరోవైపు దేశంలో ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి చరిష్మా ఇక్కడ పనిచేసింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఆయుష్మాన్ భవ, నల్ సే జల్, ఉచిత రేషన్ లాంటి పథకాల అమలుకు ఆప్ ప్రభుత్వం సవాలక్ష అడ్డంకులను కల్పించింది. దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా వంతపాడింది. దీంతో దొందూ దొందే అన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయి ఇరు పార్టీల ఓటు బ్యాంకు భారీగా దిగజారింది. కమలదళం చేసిన ప్రయత్నాలు ఫలించి వారి ఓటు బ్యాంకు పెరిగేందుకు కారణమైంది.
మోదీ ప్రభుత్వంలో మైనార్టీలూ సురక్షితమే..
మరోవైపు కాంగ్రెస్ కు అత్యంత బలమైన ఓటు బ్యాంకుగా ముస్లిం మైనార్టీలది కూడా ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో ఈ వర్గాలు కూడా బీజేపీ వైపు మళ్లినట్లు ఓటింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బట్టి తెలుస్తుంది. ఇదే విషయంపై సాజిద్ రషీద్ అనే నాయకుడు మాట్లాడుతూ.. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం అనే భావన పూర్తిగా తప్పని ఇప్పటికే చాలామంది ముస్లింలు భావిస్తున్నారన్నారు. అందుకే చాలామంది బీజేపీకి ఓటు వేసి ఉంటారని తెలిపారు. కొంతమంది వల్ల బీజేపీ ముస్లింలకు చెడు చేసే పార్టీ అని ప్రచారం జరుగుతుందన్నారు. ఇది వాస్తవం కాదన్నారు. ఒకవేళ అదే నిజమైతే బీజేపీ ఇన్నేళ్ల ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలు ఎలా సురక్షితంగా, సంతోషంగా ఉండగలుగుతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉసరవెల్లిలా రంగులు మార్చే కాంగ్రెస్, ఆప్ నాయకులు ఢిల్లీ ప్రజల తీర్పును, ముస్లిం మైనార్టీల మనోభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.