అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వరా!
కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి
బ్రతికుండగానే నెహ్రూ, ఇందిరాలకిచ్చుకుంటారా?
పార్లమెంట్ లోనూ ఫోటో సైతం పెట్టరా
అంబేద్కర్ పై పోటీకి నెహ్రూ కారణం కాదా?
ఆయన పవిత్ర స్థలాలను విస్మరిస్తారా?
బాబాసాహెబ్ ను బీజేపీ స్మరించుకుంటుంది, గౌరవించుకుంటుంది
పంచతీర్థాలను అభివృద్ధి చేసింది ప్రధాని మోదీయే
నా రాజ్యాంగం, నా గౌరవం యాత్రలో ఇంటింటికి వివరిస్తాం
నా తెలంగాణ, హైదరాబాద్: నెహ్రూ, ఇందిరాగాంధీలు భారతరత్న బ్రతికుండగానే ఇచ్చుకొని, బడుగు బలహీన వర్గాల శ్రేయస్సుకు కృషి చేసిన, రాజ్యాంగాన్ని రూపొందించిన డా. బీఆర్ అంబేద్కర్ కు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి ప్రజలకు, నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రసంగించారు.
హస్తం పార్టీ కుయుక్తులను ఎండగడతాం..
గణతంత్ర దినోత్సవం 75ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ రోజు అత్యంత పవిత్రమైన, చారిత్రాత్మకమైన రోజన్నారు. డా. బాబా సాహెబ్ అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ అనేక ఇబ్బందులకు గురి చేసిందన్నారు. అంబేద్కర్ ఎన్నికల్లో రెండుసార్లు పోటీ చేస్తే ఆయన్ని గెలవనీయకుండా నెహ్రూ కుయుక్తులు పన్ని ఓటమి పాలు చేశారని మండిపడ్డారు. అంబేద్కర్ కు ఏనాడూ కాంగ్రెస్ పార్టీ కనీస గౌరవం ఇవ్వలేదన్నారు. కనీసం పార్లమెంట్ లోనూ ఆయన చిత్రపటాన్ని కూడా పెట్టలేదన్నారు. 75 ఏళ్లు పూర్తైన అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వని దళిత ద్రోహి పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. ఎయిర్ పోర్టులు, ఇతర స్థలాలకు తమ తమ పేర్లు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పబ్బం గడుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదల సంక్షేమం కోసం ఎల్లప్పుడు పాటుపడ్డ అంబేద్కర్, రాజ్యాంగాన్ని గౌరవించుకునేందుకు నా రాజ్యాంగం, నా గౌరవం (మేరా సంవిధాన్, మేరా గౌరవ్ అభియాన్) పేరుతో ఒక సంవత్సరంపాటు యాత్ర నిర్వహించుకుంటామన్నారు. ఈ యాత్రలో అంబేద్కర్ కు, దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాలను, మోసాలను గ్రామగ్రామాన, ఇంటింటికీ తిరిగి అర్థమయ్యే రీతిలో ప్రజలకు వివరిస్తామని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
అంబేద్కర్ కు భారతరత్న ఒత్తిడి తీసుకొచ్చింది వాజ్ పేయి హాయాంలోనే..
వాజ్ పేయి హాయాంలో సంకీర్ణ ప్రభుత్వంపై అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వాలని ఒత్తిడి తీసుకువచ్చామని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అంబేద్కర్ మధ్యప్రదేశ్ లోని జన్మ స్థలం, నాగ్ పూర్ లోని దీక్షా స్థలం, లండన్ లోని విద్యనభ్యసిస్తుండగా ఉన్న ఇళ్లు, రాజ్యాంగాన్ని రచించిన స్థలాన్ని కూడా అభివృద్ధి చేశామన్నారు. రాజ్యాంగాన్ని రచించిన స్థలంలో రూ. 500 కోట్లతో అద్భుతమైన మెమోరియల్ స్థలంగా ఏర్పాటు చేశామన్నారు. ఈ స్థలాలన్నీ పంచతీర్థంగా ప్రసిద్ధి నొందాయని చెప్పారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో అంబేద్కర్ ఫోటోను ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ డా. బాబా సాహెబ్ అంబేద్కర్ కు, దేశానికి చేసిన ద్రోహాలను పూసగుచ్చినట్లు ఏడాదిపాటు ప్రతీ ఇంటికి వెళ్లి వివరిస్తామని, ప్రతీ ఒక్కరికి గణతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు.