మహాకుంభమేళా @ 57.50 కోట్లు

Mahakumbh Mela @ 57.50 crores

Feb 20, 2025 - 15:25
 0
మహాకుంభమేళా @ 57.50 కోట్లు

సమయం పొడిగించేది లేదు
మహాశివరాత్రి ఫిబ్రవరి 26నే చివరి  పుణ్యస్నానాలు
ప్రాముఖ్యతను తగ్గించే 101 ఖాతాలపై ఎఫ్​ ఐఆర్​ నమోదు

లక్నో: మహాకుంభ మేళాలో గురువారం మధ్యాహ్నం వరకు 57.50 కోట్ల మంది పుణ్య స్నానాలాచరించారు. గురువారం మధ్యాహ్నం వరకు 51 లక్షల మంది త్రివేణి సంగమంలో స్నానాలాచరించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు గురువారం దేశ విదేశాల నుంచి 40 మంది వీవీఐపీలు పుణ్య  స్నానాలు ఆచరించనున్నట్లు తెలిపారు. నేటికి 39వ రోజుకు మహాకుంభ మేళా చేరుకుందని, ఇంకా ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. మేళా పొడిగింపుపై వస్తున్న వార్తలు, వాదనలు సరికావన్నారు. సమయాన్ని పొడిగించమన్నారు. 8 నుంచి 10 కి.మీ. వరకు రద్దీ నెలకొంది. పార్కింగ్​ కోసం వాహనాలను ప్రయాగ్​ రాజ్​ వెలుపలే నిలిపివేస్తున్నారు. అక్కడి నుంచి రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన షటిల్​ బస్సుల ద్వారా భక్తులను త్రివేణి సంగమానికి చేరుస్తున్నారు. కాగా శుక్రవారం నుంచి మరింత రద్దీ పెరగనుందని అధికారులు అంచనా వేశారు. ఓ వైపు మరో ఆరు రోజులే మిగిలి ఉండడం, వారంతం చివరి రోజులు కావడంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి స్నానాలతో మహాకుంభమేళా ముగియనుందని ప్రకటించారు. 

మరోవైపు మహాకుంభమేళాపై అసత్య ప్రచారం చేస్తున్న, అశ్లీల చిత్రాలను పెడుతున్న 101 సోషల్​ మీడియా ఖాతాలపై ఎఫ్​ ఐఆర్​ నమోదు చేసినట్లు వివరించారు. వీరంతా మేళా ప్రాముఖ్యతను తగ్గించేందుకు నకిలీ పోస్టులు, పుకార్లను వ్యాపింప చేస్తున్నారని అధికారులు తెలిపారు. వీరిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.