ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపర్చుకుందాం
కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి
టాయ్ లెట్ క్లీనింగ్ మిషన్ పంపిణీ
నా తెలంగాణ, సికింద్రాబాద్: రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షులు, కేంద్ర, బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. శనివారం బేగంపేట్ లోని కట్టమైసమ్మ ప్రభుత్వ పాఠశాలలో టాయ్ లెట్ క్లీనింగ్ మిషన్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడారు. 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలను తెలిపారు. రాజ్యాంగాన్ని రూపొందించుకొని 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయన్నారు.
విద్యావ్యవస్థలో అనేకరకాల మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. నూతన విద్యా విధానం ప్రవేశపెట్టాక అందరూ స్వాగతం పలికారని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ విద్యావిధానం అమలు చేయాల్సిన అవసర ఉందన్నారు. రోజురోజుకు అమ్మభాష, మాతృభాషకు ఆదరణ పెరుగుతుందన్నారు. హైస్కూల్ స్థాయిలో విద్యార్థులకు నచ్చిన స్కిల్స్ నేర్పాలని ఎడ్యుకేషన్ పాలసీలో నిర్ణయించామన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో టాయ్ లెట్ క్లీనింగ్ మిషన్లను ఇస్తున్నామన్నారు. చిన్న చిన్న తరగతుల విద్యార్థులకు మరుగుదొడ్డి ఉపయోగంపై పెద్దగా అవగాహన ఉండదన్నారు. ఈ మిషన్లతో వెంటనే మరుగుదొడ్డిని శుభ్రం చేయొచ్చని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు బడ్జెట్ పెంచే విషయంపై కూడా స్థానిక ఎంపీగా తన సహాయ సహకారాలుంటాయని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.