డిజిటల్​ ఆర్థిక వ్యవస్థలో 11.8 శాతం వృద్ధి నమోదు

11.8 percent growth recorded in digital economy

Jan 25, 2025 - 12:48
 0
డిజిటల్​ ఆర్థిక వ్యవస్థలో 11.8 శాతం వృద్ధి నమోదు

జీడీపీకి రూ. 31.64 లక్షల కోట్ల సహకారం
ఆరు సంవత్సరాల్లో రెండు రెట్ల వేగంతో వృద్ధి
మంత్రిత్వ శాఖ నివేదికలో వెల్లడి

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​:  భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 11.8 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. రాబోయే ఐదేళ్లలో రెట్టింపు వేగంతో వృద్ధి చెందుతుంది. డిజిటల్ ఎకానమీపై ఐటీ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన నివేదికలో దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ రెండంకెలలో వృద్ధి చెందుతోందని పేర్కొంది. దేశ జీడీపీకి డిజిటల్ ఎకానమీ సహకారం రూ.31.64 లక్షల కోట్లు. వచ్చే ఆరు సంవత్సరాల్లో భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ రెండు రెట్లు వేగంతో వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. 

విలువ జోడింపు.. ఉపాధి కల్పన సామర్థ్యం అంచనా..
2029–-30 నాటికి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ తయారీ, వ్యవసాయం కంటే పెద్దదిగా నమోదయ్యే అవకాశం ఉంది. వచ్చే మూడేళ్లలో క్లౌడ్ సర్వీసుల్లో 24 శాతం వృద్ధి సాధ్యమవుతుంది. జనవరి 22న విడుదల చేసిన ఈ నివేదికలో తొలిసారిగా డిజిటల్ ఎకానమీ విలువ జోడింపు, ఉపాధి కల్పన సామర్థ్యాన్ని అంచనా వేశారు. ఈ నివేదిక ప్రకారం, 2022–-23లో భారతదేశ జాతీయాదాయంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వాటా 11.74 శాతంగా ఉంది. 2024–-25 చివరి నాటికి ఈ వాటా 13.42 శాతానికి పెరుగుతుంది.

వ్యవసాయ రంగంలో 45.8, తయారీ 11.4 శాతం ఉపాధి సృష్టి..
2022–-23 ఆర్థిక సంవత్సరంలోనే రూ. 31 లక్షల 64 వేల కోట్ల విలువైన డిజిటల్ ఆర్థిక వ్యవస్థను సృష్టించినట్లు నివేదికలో పేర్కొన్నారు. మొత్తం ఉపాధిలో 2.55 శాతం ఈ రంగం నుంచే వస్తోంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు డిజిటల్ ఎకానమీలో కోటి 46 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. అయితే వ్యవసాయ రంగం 45.8 శాతం ఉపాధిని సృష్టిస్తుండగా, తయారీ 11.4 శాతం ఉపాధిని సృష్టిస్తుంది.