బిహార్ లో రూ. 12వేల కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
దర్భాంగలో రూ. 1,260 కోట్లతో ఎయిమ్స్ కు శంకుస్థాపన
రూ. 1,740 కోట్లతో రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం
రూ. 4,020 కోట్లతో పెట్రోలియం ప్రాజెక్టుల శంకుస్థాపన
రూ. 5,070 కోట్లతో జాతీయ రహదారుల ప్రారంభోత్సవాలు
18 జన్ ఔషధి కేంద్రాల ప్రారంభం
రూ. 200 కోట్లతో సోన్ బైపాస్ రైలు మార్గం
పాట్నా: దశాబ్దాలుగా ఢిల్లీలోనే ఎయిమ్స్ ఉండేదని నిరుపేదలకు అత్యాధునిక వైద్యం అందాలంటే కత్తిమీద సాములా మారేదని, కానీ ప్రస్తుతం దేశంలో 24 ఎయిమ్స్ లను నిర్మించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దీంతో నిరుపేదలకు అత్యాధునిక వైద్యాన్ని మరింత చేరువ చేశామన్నారు. దర్భంగాలో ఎయిమ్స్ కలను సాకారం చేసే దిశగా గత ప్రభుత్వాలకు సీరియస్‌నెస్ లేదని ప్రధాని మోదీ అన్నారు. బీహార్, బెంగాల్, నేపాల్ ప్రజలు దర్భంగా ఎయిమ్స్ నుంచి ప్రయోజనం పొందుతారని సంతోషం వ్యక్తం చేశారు. ఎయిమ్స్ నిర్మాణంతో వైద్యంతోపాటు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుందన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.
ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు..
బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ బిహార్ లో పర్యటించి రూ. 12వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ. 1,260 కోట్లతో ఎయిమ్స్ కు శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా 18 జన్ ఔషధి కేంద్రాలను వర్చువల్ ద్వారా ప్రారంభించారు. రూ. 5,070 కోట్లతో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రూ. 1,740 కోట్లతో రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రూ. 200 కోట్లతో సోన్ నగర్ బైపాస్ రైలు మార్గం, రూ. 4,020 కోట్లతో పెట్రోలియం, సహజవాయువు రంగం ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
అభివృద్ధి ద్వారా కర్పూరికి నిజమైన నివాళి..
అనంతరం దర్భాంగలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఝార్ఖండ్ లోని మైథిలీ భాషకు రెండో అధికారిక భాష హోదా కల్పించామన్నారు. అమృత్ భారత్ కింద వందే భారత రైళ్లను దర్భంగా, సీతామర్హి, అయోధ్యయలకు నడుపుతున్నామని తెలిపారు. స్వాతంత్ర్యం సిద్ధించాక నిరుపేదల విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన, దేశ రక్షణ, పరిశ్రమలు, ప్రాజెక్టుల అభివృద్ధిపై గత ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయని ఆరోపించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం స్థానిక భాషల్లోనే ఉన్నత విద్యను ప్రతీఒక్కరూ అభ్యసించేలా చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. ఇది కర్పూరి ఠాకూర్ కి తామిచ్చే నిజమైన నివాళి అన్నారు. తాము చేపట్టిన అభివృద్ధితో యువతకు ఎంతో మేలు చేకూరనుందన్నారు. దళితులు, పేదలు, గిరిజనులు సులువుగా ఉన్నత విద్యను స్థానిక భాషల్లోనే చదవొచ్చన్నారు. ముజఫర్ పూర్ లో పెద్ద క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మిస్తున్నామని మోదీ తెలిపారు. ఇక్కడ అన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు చికిత్స అందజేయనున్నామని తెలిపారు. బిహార్ లో అతిపెద్ద కంటి ఆసుపత్రిని కూడా నిర్మిస్తున్నామని ప్రధాని తెలిపారు. ఇది కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు.
ఆయుష్మాన్ తో రూ. 1.25 లక్షల కోట్లు మిగిల్చాం..
దేశంలోని నిరుపేదల ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ పథకం కింద లక్షలాది మంది పేదలకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా పేదలకు రూ.1.25 లక్షల కోట్లు మిగిలాయని తెలిపారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులను కూడా ఆయుష్మాన్ యోజన పరిధిలోకి తీసుకువచ్చామని స్పష్టం చేశారు.
ప్రతీఒక్కరికి అత్యాధునిక వైద్యం అందించడమే లక్ష్యం..
భారత్ లో పేద, మధ్యతరగతి ప్రజలు అత్యాధునిక వైద్యం అందుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తమ ప్రభుత్వంలో అలా జరగనీయబోమన్నారు. ప్రతీఒక్కరి ఆరోగ్యం తమకు ముఖ్యమైన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలను చేపట్టిందన్నారు. గత ప్రభుత్వాలు కేవలం వాగ్ధానాలు చేసి తప్పించుకునేవని, కానీ తమ ప్రభుత్వం వాగ్ధానాలను ఇవ్వడమే గాక వాటిని నెరవేర్చే వరకు పనిచేస్తుందన్నారు. నితీశ్ కుమార్ ప్రభుత్వం బిహార్ లో అధికారంలోకి రాకముందు ఈ ప్రాంతం నిరాధారణకు గురైందన్నారు. నితీశ్ ప్రభుత్వం కొలువయ్యాక కేంద్రంతో బిహార్ నిరుపేదల కోసం, తమ ప్రాంత అభివృద్ధి కోసం తీవ్రంగా శ్రమించారని హర్షం వ్యక్తం చేశారు.