ఈసీ తనిఖీలు ప్రతిపక్షాలకు బీజేపీ కౌంటర్​

EC inspections are BJP's counter to the opposition

Nov 13, 2024 - 14:32
 0
ఈసీ తనిఖీలు ప్రతిపక్షాలకు బీజేపీ కౌంటర్​

బీజేపీ నేతల తనిఖీ వీడియో విడుదల
ఉద్ధవ్​ ఠాక్రేను నిలదీసిన బీజేపీ నాయకులు

ముంబాయి: బీజేపీ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​, కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీల బ్యాగులను, హెలికాప్టర్లలోనూ ఈసీ అధికారులు తనిఖీలు చేపట్టిన వీడియోను విడుదల చేసి శివసేన (ఉద్ధవ్​ ఠాక్రే) వర్గానికి బుద్ధి చెప్పింది. ఉద్ధవ్​ ఠాక్రే హెలికాప్టర్​ తనిఖీ నేపథ్యంలో చేస్తున్న ఆరోపణలకు బుధవారం బీజేపీ చెక్​ పెట్టింది. ఎన్నికల కమిషన్​ ఆదేశాల మేరకు మహారాష్ర్ట ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈనేపథ్యంలో అధికార, అనధికార అని గాకుండా ఈసీ అధికారులు అన్ని పార్టీల వాహనాలు, హెలికాప్టర్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉద్ధవ్​ ఠాక్రే హెలికాప్టర్​ లో వెళ్లేందుకు సిద్ధమవ్వగా అధికారులు అందులో తనిఖీలు నిర్వహించారు. దీన్నే సాకుగా చూపుతూ బీజేపీ ఈ తనిఖీలను కావాలనే ప్రతిపక్ష పార్టీలపై చేయిస్తుందని ఆరోపించారు. దీనిపై మండిపడ్డ మహారాష్ర్ట బీజేపీ పార్టీ తమ నాయకుల బ్యాగులు, హెలికాప్టర్లలో ఈసీ అధికారులు తనిఖీలు నిర్వహించిన వీడియోలను విడుదల చేసి ఆరోపణలకు కౌంటరిచ్చారు. 

మహారాష్ర్ట డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​ నవంబర్​ 7న యవత్మాల్​ పర్యటన సందర్భంగా తనిఖీలు నిర్వహించారు. కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ ఓ కార్యక్రమం సందర్భంగా ప్రత్యేక విమానంలో వెళ్లడానికి ముందే ఈసీ అధికారులు తనిఖీలు చేపట్టారు. వీడియోను విడుదల చేస్తూ బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు ప్రతీ విషయాన్ని రాజకీయం చేసే అలవాటుగా మారిపోయిందన్నారు. వీరికి ప్రజాసంక్షేమం కూడా ఏ మాత్రం పట్టదన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనన్నారు. ఈసీ అధికారులు అధికార, ప్రతిపక్ష అనే తేడా లేకుండా వారి విధులు సమర్థవంతంగా నిర్వహిస్తుంటే ఆరోపణలు చేయడం వీరి అవివేకం అన్నారు. కేవలం రాజ్యాంగం పేరు చెబుతూ ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదోవపట్టించే చర్యలకు దిగుతున్నాయని ఆరోపించారు. రాజ్యాంగాన్ని రక్షించే పార్టీలు నిజమైన ప్రజాస్వామ్య పార్టీలని బీజేపీ నాయకులు తెలిపారు.