కాలుష్య ఉద్గారాలను నియంత్రించాల్సిందే
సుప్రీం న్యాయమూర్తి విక్రమ్ నాథ్

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పిల్లలు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించి ఆడుకోవడం ఆమోదయోగ్యం కాదని, కాలుష్య ఉద్గారాలను నియంత్రించడం అత్యవసరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి విక్రమ్ నాథ్ అన్నారు. న్యూ ఢిల్లీలో శనివారం జరిగిన పర్యావరణ సదస్సులో పాల్గొని అభిప్రాయాలను పంచుకున్నారు. ఆర్థిక వృద్ధి, పర్యావరణ శ్రేయస్సు మధ్య సమతుల్యతను కొనసాగించే పరిష్కారాలను కనుగొనాల్సిన అవసరం ఉందని చెప్పారు. గ్రీన్ టెక్నాలజీ విధానాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాలకు సూచించారు. ఢిల్లీలో అత్యధిక కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు మాస్కులు ధరించి ఆడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నవయసులోనే శ్వాసకోశ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉండడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఉద్గారాలను తగ్గించేందుకు, నియంత్రించేందుకు మనం పీల్చే గాలి విషయంలో రాజీపడకుండా ఉంటేనే స్వచ్ఛమైన వాతావరణం సాధ్యపడుతుందని చెప్పారు. దేశంలో నీటి కాలుష్యంపై కూడా న్యాయమూర్తి విక్రమ్ నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. నదులను శుభ్రం చేయాలని, పారిశ్రామిక వ్యర్థాలు చేరకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. దేశంలో స్వచ్ఛమైన వాతావరణం కోసం కృషి చేస్తున్న నేషనల్ గ్రీన్ ట్రీబ్యునల్ పాత్రను ప్రశంసించారు. దేశంలో స్వచ్ఛమైన వాతావరణం మెరుగుపరిచేందుక ఈ సంస్థ ఒక ఆశాకిరణంగా ఉద్భవించిందని వివాదాల పరిష్కారంలోనూ కీలక పోషిస్తుందని న్యాయమూర్తి విక్రమ్ నాథ్ సంతోషం వ్యక్తం చేశారు.