ఉగ్రదాడుల్లో సైనికుడి వీరమరణం

ఐదుగురికి గాయాలు ఒక ఉగ్రవాది హతం వరుస దాడులతో కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తం

Jun 12, 2024 - 13:23
 0
ఉగ్రదాడుల్లో సైనికుడి వీరమరణం

శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​ లో రెండు ఉగ్రవాద దాడులు జరిగాయి. మంగళవారం అర్థరాత్రి భదర్వా-పఠాన్‌కోట్ రహదారిపై 4 రాష్ట్రీయ రైఫిల్స్, పోలీసుల జాయింట్ చెక్ పోస్ట్‌పై ఉగ్రవాదులు కాల్పులులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఐదుగురు సైనికులతోపాటు ఓ పోలీసు ఎస్​ పీవో అధికారికి గాయాలయ్యాయి. దాడి జరిపింది తామేనని కాశ్మీర్​ టైగర్స్​ అనే ఉగ్ర సంస్థ ప్రకటించినట్లు పోలీసులు తెలిపారు.  కథువాలోనూ డీఐజీ, ఎస్​ ఎస్పీ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఒక సైనికుడు కబీర్​ దాస్​ కు తీవ్ర గాయాలయ్యాయి. అతను చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందినట్లు భద్రతా దళాలు ప్రకటించాయి. దాడి జరిపిన వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుదాడికి దిగాయి. ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతని వద్ద నుంచి ఏకే 47 రైఫిల్​, బ్యాగ్​ ను స్వాధీనం చేసుకున్నారు. కాల్పులకు పాల్పడింది ఇద్దరు ఉగ్రవాదులుగా గుర్తించారు. వీరిలో ఒకరు హతమవగా, మరో ఉగ్రవాది కోసం సెర్చ్​ ఆపరేషన్​ కొనసాగుతోంది. కాగా చెక్​ పోస్టుపై దాడిలో ఎంతమంది ఉగ్రవాదులు పాల్గొన్నారనే విషయం తెలియరాలేదు. 

జూన్​ 9న రియాసీలో భక్తులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 9మంది మృతికి కారణమయ్యారు. ఈ ప్రాంతంలో ఇంకా సెర్చ్​ ఆపరేషన్​ కొనసాగుతున్నట్లు ఆర్మీ ప్రకటించింది. 

జమ్మూకశ్మీర్​ ఎన్నికల ప్రకటన అనంతరం భారీ దాడులు చేయాలని పాక్​ సరిహద్దుల్లో 300మంది వరకు ఉగ్రవాదులు సమావేశమైనట్లు కేంద్ర ఇంటలిజెన్స్​ వర్గాలు గుర్తించాయి. దీనిపై కేంద్ర హోంశాఖ ప్రత్యేక దృష్టిని సారించింది. ఈ పరిణామాలను ప్రధాని నేతృత్వంలోని ప్రత్యేక రక్షణ బృందం పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ మూడు ఉగ్రదాడులపై స్థానికంగా ఆందోళన నెలకొంది.