మరోమారు మయన్మార్ లో భూకంపం
Another earthquake in Myanmar

భయాందోళనలో ప్రజలు
వెయ్యి మందికిపైగా మృతి
జనరల్ ఆంగ్ హ్లెంగ్ తో మాట్లాడిన ప్రధాని మోదీ
మయన్మార్ చేరుకున్న భారత్ రెస్క్యూ బృందం, సహాయ సామాగ్రి
రష్యా, చైనా, యూఎన్, హాంకాంగ్, సింగపూర్, మలేషియాల సాయం
మరోమారు భూకంపం రావొచ్చు: శాస్ర్తవేత్తలు
విద్యుత్ లేక రెస్క్యూ చర్యలకు తీవ్ర ఆటంకాలు
నైపిడా: మయన్మార్ లో తీవ్ర భూకంపం కాస్త అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తుంది. శుక్రవారం సంభవించిన భూకంపానికి తోడు శనివారం మధ్యాహ్నం మరో రెండుసార్లు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లలోకి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. దేశవ్యాప్తంగా 2000 భారీ భవనాలు నేలమట్టం కాగా, భారీ ఎత్తున రోడ్లు ధ్వంసమయ్యాయి. ఈ భూకంపంలో శనివారం సాయంత్రం వరకు 1000కి పైగా మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. 2400మంది వరకు గాయాలయ్యాయి. చెప్పారు. మరికొంతమంది ఆచూకీ లభించడం లేదని వారి సంఖ్య ఎంతన్నది ఇప్పుడప్పుడే చెప్పలేమన్నారు. కాగా శనివారం రెండుసార్లు భూప్రకంపనలు చోటు చేసుకోగా వాటి తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.1, 4.7గా నమోదైంది. అయితే యూనైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం మృతుల సంఖ్య 10వేల దాటవచ్చని అంచనా వేయడం గమనార్హం. శుక్రవారం భూకంపం థాయ్ లాండ్, బంగ్లాదేశ్, చైనా, భారత్ లోను సంభవించింది. అయితే అంత తీవ్ర స్థాయి లేదు. మయన్మార్, థాయ్ లాండ్ చరిత్రలో ఇదే అత్యంత విధ్వంసకర భూకంపంగా నమోదైందని అధికారులు వివరించారు. దీంతో ఆరు రాష్ర్టాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు.
విషాద సమయంలో ధృడంగా ఉండాలి: మోదీ..
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాల మేరకు భారత్ నుంచి సీ–12 విమానంలో 80మంది రెస్క్యూ సిబ్బందితోపాటు పలు వస్తువులను పంపించారు. మరోవైపు ప్రధాని మోదీ మయన్మార్ పీపుల్స్ గవర్నమెంట్ అధిపతి జనరల్ మిన్ ఆంగ్ హ్లెంగ్ తో మాట్లాడారు. విషాద సమయంలో ధృడంగా ఉండాలన్నారు. భారత్ అండగా నిలుస్తుందని ధైర్యం చెప్పారు. భూకంపం నుంచి మయన్మార్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. మృతుల పట్ల సంతాపం ప్రకటించారు. భారత్ చేపట్టిన సహాయ కార్యక్రమానికి ఆపరేషన్ ‘బ్రహ్మ’గా పేరు పెట్టారు.
ఐక్యరాజ్య సమితి రూ. 43 కోట్ల సహాయం..
మయన్మార్ లో సంభవించిన భూకంపం అత్యంత దురదృష్టకరంగా యూఎన్ (ఐక్యరాజ్యసమితి) అభివర్ణించింది. వెంటనే ఆ దేశం కోలుకునేందుకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచదేశాలు కూడా మయన్మార్ ను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది.
రష్యా సహాయం..
మయన్మార్ భూకంపంపై పుతిన్ ఆవేదన వ్యక్తం చేశారు. మయన్మార్ కు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించారు. 120 మంది రెస్క్యూ బృందంతో సహా రెండు సామాగ్రిని మోసుకెళ్లే విమానాల ద్వారా సాయం అందించారు. మరోవైపు చైనా రూ. 115కోట్లను సహాయంగా అందజేస్తామని ప్రకటించింది. హాంకాంగ్, సింగపూర్, మలేషియాలు కూడా మయన్మార్ కు రెస్క్యూ బృందాలను పంపాయి.
మయన్మార్ కు 43 కోట్ల రూపాయల సహాయం అందించిన ఐక్యరాజ్యసమితి..
సహాయ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఐక్యరాజ్యసమితి మయన్మార్‌కు 5 మిలియన్ డాలర్లు (రూ. 43 కోట్లు) ఇచ్చింది.
శాస్త్రవేత్తల అభిప్రాయం..
మయన్మార్ లో 7.7 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం 334 అణు బాంబుల పేలుడు శక్తితో సమానమైన శక్తిని ఉత్పత్తి చేసిందని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంత తీవ్రతతో వచ్చిన భూకంపాల అనంతరం భూమి పొరల్లోని టెక్టానిక్ ప్లేట్స్ లో మరోమారు స్వల్ప కదలికలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. అంటే మరికొన్ని సార్లు భూమి కంపించే అవకాశం ఉందన్నారు.
విద్యుత్ లేకపోవడంతో రెస్క్యూ బృందాలకు ఆటంకాలు..
కాగా వివిధ దేశాల రెస్క్యూ బృందాలు పెద్ద ఎత్తున సహాయక చర్యల్లో పాల్గొనేందుకు మయన్మార్ లో భూకంపం సంభవించిన ప్రాంతాలకు చేరుకున్నాయి. కూలిపోయిన భారీ భవంతుల వద్ద బృందాల వారీగా ప్రాణాలతో ఉన్నవారిని బయటికి తీసే చర్యలను చేపట్టాయి. అయితే ఈ బృందాలు తీసుకువచ్చిన అత్యాధునిక మిషన్లకు విద్యుత్ అవసరం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలడంతో రెస్క్యూ చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.