శక్తి స్వరూపిణులకు జై

కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి

Mar 7, 2025 - 15:15
Mar 7, 2025 - 15:46
 0
శక్తి స్వరూపిణులకు జై

మహిళలను శక్తిగా కొలిచే సాంప్రదాయం భారత్​ కే సొంతం
కుటుంబాన్ని చక్కదిద్దేది మహిళలే
అన్ని రంగాల్లో ఆడబిడ్డల పాత్ర కీలకం
ఏకె 47లతో సరిహద్దుల్లో కాపలా
అత్యధిక పైలెట్లున్న దేశం భారత్​
భేటీ బచావో భేటీ పడావో బృహత్తర కార్యక్రమం
సెల్ఫ్​ హెల్ప్​ గ్రూప్​ లు అత్యధికం
బీఆర్​ఎస్​ ఒక్క మహిళా మంత్రిని నియమించలే
ఫ్రీ బస్సు ఇచ్చి పగటి కలలు కనమంటున్న కాంగ్రెస్​

నా తెలంగాణ, హైదరాబాద్​: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శక్తిస్వరూపిణులకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలను శక్తిగా కొలిచే అద్భుతమైన సాంప్రదాయం కేవలం భారతీయ జీవన విధానం, సంస్కృతి ఉందన్నారు. పురాణాల నుంచి నేటి వరకు కూడా అనేక రంగాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. రోజువారీ కార్యక్రమాల్లోనూ శక్తి స్వరూపిణుల పేర్లనే ముందుగా ఉచ్ఛరిస్తామని స్పష్టం చేశారు. భారతీయ జీవన విధానంలో ఇల్లును చక్కదిద్దేవారు మాతృమూర్తి అన్నారు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా పాత్ర కీలకమన్నారు. ఎంపీ, శాసనసభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కీలకపాత్ర పోషించారన్నారు. తన ఎంపీ నియోజకవర్గంలో ఐదువేలమంది మహిళలు తమ తమ బూత్​ లలో మహిళా శక్తి పనిచేసిందని తన గెలుపులోనూ వారీ పాత్ర కీలకమన్నారు. 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం బీజేపీ నగర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. పలువురు మహిళలకు అవార్డులను అందజేసి సత్కరించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు.

ట్రిపుల్​ తలాక్​ రద్దు..
తాను హోంమంత్రిగా ఉన్నప్పుడు సరిహద్దుల్లోనూ ఆడబిడ్డలు ఏకె 47తో నిరంతరం కాపలా కాస్తున్నారని కొనియాడారు. విమాన రంగంలో అత్యధిక పైలెట్లు అత్యధికంగా భారత్​ లోనే ఉన్నారని గుర్తు చేశారు. ట్రిపుల్​ తలాక్​ 12 కోట్ల మంది ముస్లిం ఆడబిడ్డల హక్కులు కాపాడేందుకు అనేక ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయన్నారు. మూడుమాటలతో ఇంటినుంచి గెంటివేసే ప్రక్రియ కొనసాగిందని విమర్శించారు. ఇస్లామిక్​ దేశాల్లో కూడా ఈ చట్టం లేదన్నారు. సెక్యూలర్​ దేశంలో ట్రిపుల్ తలాక్​ పై ఎవ్వరూ మాట్లాడే, వ్యతిరేకంగా వెళ్లే ధైర్యం చేయలేదన్నారు. కానీ మోదీ నాయకత్వంలో ట్రిపుల్​ తలాక్​ చట్టాన్ని రద్దు చేసి హక్కులు కల్పించామని అన్నారు. 

ప్రసూతి సెలవులు 26 వారాలు పొడిగింపు..
‘భేటీ బచావో.. భేటీ పడావో’ కేవలం నినాదం కాదన్నారు. ఆడపిల్లలను రక్షించే బృహత్తర కార్యక్రమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద మహిళలున్నారని అన్నారు.వాజ్​ పేయి ప్రభుత్వ హయాంలో సెల్ఫ్​ హెల్ప్​ గ్రూపులు తీసుకొచ్చారన్నారు. మోదీ హయాంలో అత్యధికంగా గ్రూపులు ఉన్నాయన్నారు. ప్రసూతి సెలవులు 26 వారాలు పొడిగించిన ఘనత బీజేపీదే అన్నారు. స్టార్టప్​ సంస్థల్లోనూ అత్యధిక సంఖ్యలో పనిచేస్తున్నారని, స్థాపిస్తున్నారని అన్నారు. మెజార్టీ ఐటీల్లో మహిళలే కీలక పాత్ర పోషిస్తూ నెలకు రూ. 4, రూ. 5 అత్యధిక ప్యాకేజీలు అందుకుంటున్నారని అభినందించారు.

33 శాతం రిజర్వేషన్లు..
రాజ్యాంగం రూపకల్పన చేసినప్పుడు మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్​ ఉండాలని చెప్పారని అన్నారు. అనేక చర్చల తరువాత బిల్లులు పెట్టారే గానీ వాటి అమలులో విఫలమయ్యారన్నారు. కానీ మోదీ ప్రభుత్వ హయాంలో కొత్త పార్లమెంట్​ లో మహిళలకు 33 శాతం కేటాయించామన్నారు. ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారం తెలంగాణలోనూ 40 సీట్లు మహిళలకే దక్కనున్నాయన్నారు. అత్యధిక కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, జిల్లా పరిషత్​ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్​ చైర్మన్లుగా మహిళలు బీజేపీలోనే ఉన్నారని అన్నారు. 

ఉమ్మడి కుటుంబ వ్యవస్థను నిలబెట్టుకోవాలి..
తెలంగాణలోనూ మహిళలు అన్ని రంగాల్లో కీలకపాత్ర పోషించాలన్నారు. 2014 తరువాత దురదృష్టవశాత్తు మహిళా మంత్రి లేకుండా బీఆర్​ఎస్​ పాలించిందన్నారు. మహిళలను అవమానపర్చడం, నిర్లక్ష్యం చేసిందన్నారు. ఐదేళ్లపాటు పాలించడాన్ని మహిళా లోకం ఆలోచించాలన్నారు. మోదీ నేతృత్వంలో మహిళా రాష్ర్టపతిని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. స్వామి వివేకానంద, బాబా సాహెబ్​ అంబేద్కర్​, ఫూలే మహిళా సాధికారతలో ముందంజలో ఉన్నారని అన్నారు. విద్య, వ్యాపార, సామాజిక, అన్నిరంగాల్లో కుటుంబ వ్యవస్థ, భారతీయ సంస్కృతిని రక్షించుకుంటూ మహిళలు ముందుకు వెళ్లడం అభినందనీయమన్నారు. కుటుంబ ఉమ్మడి వ్యవస్థను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

అట్టడుగు వర్గాల మహిళలకు పద్మశ్రీలు..
మోదీ అధికారంలోకి వచ్చాక ఇంకా గుర్తింపు పొందని వారికి గుర్తింపు లభించిందన్నారు. అట్టడుగు వర్గాల మహిళలకు కూడా పద్మశ్రీలు కేటాయించి ఆదర్శంగా నిలుస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ నగర కార్యాలయంలో ఎంతో కమిట్‌మెంట్​ తో పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి,నిజమైన మార్పు సాధ్యమని, భారతీయ సంస్కృతి, జీవన విధానం మెరుగుపడుతుందని మనసా, వాచా నమ్మిన మహిళలందరికీ శిరస్సు వంచి నమస్కరించారు. తెలంగాణ ఉద్యమంలో కాలికి గజ్జకట్టి ఉద్యమంలో పాల్గొన్న విషయం తనకు తెలుసన్నారు. తీవ్రమైన వాతావరణంలోనూ  ఆడబిడ్డలు పనిచేసి రాష్​ర్టాన్ని సాధించుకున్నారని అన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చి 14 నెలలు గడిచిపోయినా కేసీఆర్​ లాగే పరిపాలన ఉందన్నారు. ఫ్​రీ బస్సు ఇచ్చాను అంటూనే కలలు కనండి అంటూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగం, ఉపాధి, నిరుద్యోగ భృతి హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.

ఎమ్మెల్సీ స్థానాల్లో 90 శాతం ఓట్లు వారివే..
37 శాతం పోలింగ్​ బూత్​ లో 33 శాతం ఓట్లు వేశారన్నారు. దేశంలో 70 శాతం మంది బీజేపీని ఆశీర్వదించారన్నారు. కొన్ని జిల్లాల్లో 60 శాతం ఓటింగ్​ తమ పార్టీకి లభించిందన్నారు. ఎమ్మెల్సీ మూడు స్థానాల్లో రెండు స్థానాలను నిలబెట్టుకున్నామన్నారు. మహిళా ఉపాధ్యాయులు, పట్టభద్రులు 90 శాతం ఓట్లు బీజేపీకే పడ్డాయని సర్వేలో తేలిందన్నారు. మోదీ నాయకత్వానికి మద్ధతిచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ ఉన్న బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీలు వైఫల్యం చెందాయన్నారు. రాష్ర్టాన్ని రక్షించుకోవాలంటే సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. గొంతెత్తి, పిడికిలి బిగించాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్​ఎస్​,కాంగ్రెస్​ అనేక డిక్లరేషన్​ లు ఇచ్చి మభ్యపెట్టారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్యారంటీలు, హామీల పట్ల ప్రభుత్వాన్ని కాంగ్రెస్​ పార్టీ నేతలను పిడికిలి బిగించి నిలదీయాలని అన్నారు. 

జనగణనకు సిద్ధం..
మోదీ నేతృత్వంలో జనగణన జరుగుతుందన్నారు. పార్లమెంట్​, అసెంబ్లీ నియోజకవర్గాల్లో రానున్న ఎన్నికలకు ముందే మహిళల రిజర్వేషన్ల చట్టం అమలు చేయనున్నామన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న పార్టీలు సీట్లు తగ్గుతాయని అసత్య ప్రచారాలకు దిగుతున్నారని మండిపడ్డారు. పునర్విభజన జరిగి తీరుతుందని రిజర్వేషన్లను ఏర్పాటు చేసి తీరుతామని ఒక్కసీటు తగ్గకుండా ఆ పరిధిలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. 

సీట్లు తగ్గవు..
ఇప్పటికైనా బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని అన్నారు. జనాభా సేకరణపై విపక్షాలు చేస్తున్నవి తప్పుడు ఆరోపణలేనని హోంమంత్రి కేంద్ర కేబినెట్​ లో చెప్పారని అన్నారు. ఒక్కటి కూడా తగ్గే అవకాశం లేదన్నారు. తెలంగాణలో 17కు 17, ఏపీలో 25కు 25 సీట్లు ఉంటాయన్నారు. దక్షిణాది ఆల్​ పార్టీ సమావేశం పెట్టుకుంటామని బెదిరింపు ధోరణికి దిగుతున్నారని అందుకు తమకు అభ్యంతరం ఏమీ లేదన్నారు. 2009లో పునర్విభజన ఏ రకంగానైతే జరిగిందో అదే రకంగా పునర్విభజనలో చర్యలు తీసుకుంటామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు.

అన్ని స్థానాల్లో, స్థాయిల్లో పోటీ చేయాలి..
రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని గ్రామ పంచాయితీ వార్డు నుంచి మొదలు పెట్టి జిల్లా పంచాయితీ సీటు వరకు కార్పొరేషన్ లలో మహిళలు కీలక పాత్ర వహించాలని పోటీ చేయాలని అన్నారు. రిజర్వేషన్​ స్థానాల్లోనే గాకుండా, జనరల్​ స్థానాల్లోనూ మహిళలు పోటీలో ఉండాలని కోరారు. కింది స్థాయి నుంచి రాజకీయ పార్టీలో పనిచేస్తున్న వారికే సీట్లు లభించాల్సిన అవసరం ఉందన్నారు. సిద్ధాంతాల కోసం పనిచేస్తున్న వారికే ప్రాధాన్యత రావాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక, రాజకీయ పరంగా పనిచేసే మహిళలకు ప్రాధాన్యత దక్కుతుందన్నారు. మోదీ కుటుంబ రాజకీయాలు ఉండవద్దని తొలి నుంచి చెబుతుంటారని అన్నారు. సోనియాగాంధీ, రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీలు వచ్చి తమకు నీతులు చెబుతూ హక్కుల గురించి మాట్లాడుతుంటారని ఇది మంచి సాంప్రదాయం కాదని, రానున్న రోజుల్లో మార్పు రావాలని సామాజిక సమస్యలపై పోరాటం చేసే మహిళలకే రాజకీయ అవకాశాలు దక్కాలని ఆ దిశగా పోరాటంలో మహిళలు సిద్ధంగా ఉండాలని జి.కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు.