పాక్​ చిప్పట్టుకుంది

కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

Feb 14, 2025 - 17:20
 0
పాక్​ చిప్పట్టుకుంది

మోదీ బలమైన విధానాలతో ఉగ్రవాదం అంతం

నా తెలంగాణ, పటాన్​ చెరు: 2014 ముందు దేశం ఏ విధంగా ఉండేదో, నేడు ఏ విధంగా ఉందో ఉపాధ్యాయులు, పట్టభద్రులు రాష్​ర్టప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 2014కు ముందు ఉగ్రదాడులు, కర్ఫ్యూలు, దాడులు బాంబ్లస్ట్​ లే చూసేవారమన్నారు. లుంబినీ, గోకుల్​ చాట్​, దిల్​ సుఖ్​ నగర్​ సాయిబాబా టెంపుల్​ వద్ద పేలుళ్లు జరిగాయన్నారు. మెహిదీపట్నంలో అడిషనల్​ ఎస్పీ కృష్ణ ప్రసాద్​, ఎసీపీ సత్తయ్యను ఉగ్రవాదులు చంపారన్నారు. ముంబాయిలో మధ్యాహ్నం 2 గంటలకు ఏడు రైళ్లను పేల్చిన చరిత్ర ఉగ్రవాదులదన్నారు. మోదీ పాలన పదేళ్లలో పరిస్థితులను దేశ ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు.  పాక్​ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశామన్నారు. భారత్​ లో దాడులకు దిగే పాక్​ కు పూర్తిగా బుద్ధి చెప్పామని, చిప్పపట్టుకొని అడుక్కునే పరిస్థితికి మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. పూల్వామాలో దాడుల అనంతరం వారి భూభాగంలోనే ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి వారిని మట్టుబెట్టి ప్రపంచదేశాలకు, ఉగ్రవాదానికి గట్టి సందేశమిచ్చామని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. ఈ నెల 27న జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో కరీంనగర్​, మెదక్​, నిజామాబాద్​, ఆదిలాబాద్​  నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయుల నియోజకవర్గానికి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 

శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్​ చెరులో జరిగిన సభలో కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి ప్రసంగించారు. చట్టసభలు ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్రాలలో ఎగువసభ, దిగువ సభలుంటాయన్నారు. శాసనమండలి లో ప్రత్యేకంగా ఉపాధ్యాయుల కోసం వారే ఎన్నుకునే విధంగా స్థానాలుంటాయన్నారు. గ్రాడ్యుయేట్లు పట్టభద్రుల కోసం కొన్ని స్థానాలను కేటాయిస్తారన్నారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు స్థానిక సంస్థల నుంచి ఉంటాయన్నారు. 

కాంగ్రెస్​ సీటులో ప్రచారమేది?..
నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి పట్టభద్రుల ఓటరు లిస్టు తయారైందన్నారు. వారందరూ తమ ఓటు హక్కు ద్వారా అభ్యర్థిని ఎన్నుకోవచ్చన్నారు. ఉపాధ్యాయులు కూడా వారి ప్రతినిధిని ఎన్నుకునే అవకాశం ఉందన్నారు. ఇది గాకుండా ఖమ్మం, వరంగల్​, నల్గొండ ఉపాధ్యాయ ఎన్నికలు జరగనున్నాయన్నారు. రెండు ఉపాధ్యాయ, ఒకటి పట్టభద్ర నియోజకవర్గ ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఏ రాజకీయ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం చేయడం లేదన్నారు. కాంగ్రెస్​ ఒకటి అర సీటు పోటీ చేస్తూ ప్రచారం చేసే పరిస్థితిలో కూడా లేదన్నారు. 

కాంగ్రెస్​ హయాంలో రోజుకో కుంభకోణం..
బొగ్గు, కామన్​ వెల్త్​, 2 జీ స్పెక్ర్టమ్​ మన్మోహన్​ సింగ్​ పదేళ్ల హయాంలో సోనియా నేతృత్వంలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ప్రస్తుతం మోదీ వచ్చి 10 సంవత్సరాలు గడిచిందని ఏదైనా పత్రికా, సంస్థ, మోదీ ప్రభుత్వం, మంత్రులు అవినీతికి పాల్పడ్డారనే ధైర్యం ఎవ్వరూ చేయడం లేదంటే అంత నీతి నిజాయితీతో పనిచేస్తున్నామన్నారు. కాంగ్రెస్​ కు, బీజేపీకి ఉన్న తేడా అదే అన్నారు.

400 ఫోన్​ తయారీ సంస్థలు..
మేధావులు ఈ విషయాలను ఆలోచించాలన్నారు. మోదీ అధికారంలోకి రాకముందు రెండు సంస్థలు సెల్​ ఫోన్​ లు తయారు చేసేవన్నారు. ఈ రోజు 400 సంస్థలు తయారు చేస్తున్నాయని, ఏకంగా యాపిల్​ ఫోన్​ లు ఇక్కడ తయారు చేసి అమెరికాకు పంపిస్తున్నామని అన్నారు. పీపీకిట్లు, మాస్క్​ లు, ఆక్సిజన్​ సిలెండర్లు లాంటివి దేశీయంగానే తయారు చేసుకొని ఎగుమతి చేస్తున్నామన్నారు. అన్ని రంగాల వనరులను సమకూర్చుకొని ముందుకు వెళుతున్నామన్నారు. 

మోదీ ట్రంప్​ ను కలిసి భారత గౌరవాన్ని పెంచారు..
అమెరికా నుంచి మోదీ వస్తున్నారని అన్నారు. ట్రంప్​ గెలిచాక తొలి ప్రధాని మోదీయే కలిశారని అన్నారు. ఇది భారత గౌరవాన్ని ప్రపంచంలో పెంచే ప్రయత్నమన్నారు. రష్యా యుద్ధంలో 20వేల మంది విద్యార్థులు చిక్కుకుంటే మోదీ రష్​యా, ఉక్రెయిన్​ లతో మాట్లాడి యుద్ధాన్ని ఆపించి వెనక్కు తీసుకువచ్చారన్నారు. శక్తి, యుక్తి, సమర్థత బీజేపీకి నరేంద్ర మోదీకే ఉందన్నారు. బీజేపీ స్థానిక సంస్థలతోపాటు దేశం కోసం పనిచేస్తుందన్నారు. 

మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు..
1969లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 360 మందిని చంపించారన్నారు. ఊరేగింపులు, ఉద్యమాలేంటని కర్కశంగా చంపారన్నారు. ఏడో తరగతి విద్యార్థిని రేణుక కూడా అప్పుడు చనిపోయిందని గుర్తు చేశారు. 2014లో ఆంధ్ర నుంచి విడిపోతున్నప్పుడు తెలంగాణ బడ్జెట్​ అన్ని ఖర్చులు పోనూ ఆదాయంలో మిగులు ఉండేదన్నారు. ధనికరాష్ర్టంగా ఉండేదన్నారు. కేసీఆర్​ పుణ్యామా అని 8 లక్షల కోట్లు అప్పు అయ్యిందన్నారు. అప్పుచేసి దోపిడీ చేస్తున్నారన్నారు. ప్రస్తుతం రియల్​ఎస్టేట్​, కాంట్రాక్టర్లు ఏ ఒక్కరూ సంతోషించడం లేదన్నారు. ప్రభుత్వం టెండర్లు వేస్తే పాల్గొనే పరిస్థితి లేదన్నారు. జీహెచ్​ ఎంసీలో వీధి లైట్లను వేసే వారికి కూడా ఏడు నెలలుగా జీతాలివ్వలేని పరిస్థితి ఉందన్నారు. ఐదువేల కోట్ల రూపాయలు జీహెచ్​ ఎంసీ బాండ్లు ఉంటే అవి కూడా కరిగిపోయాయన్నారు. జీహెచ్​ ఎంసీ మౌలిక వసతులు కల్పించే పరిస్థితుల్లో లేదన్నారు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ రాష్ర్టం ఏమైపోయినా పరవాలేదన్నట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. 

కాంగ్రెస్​ మూడు రాష్ట్రాలు దివాలా అంచున..
కాంగ్రెస్​ పాలిత మూడు రాష్​ర్టాలు పూర్తి దివాలా తీశాయని, ఆప్​ అధికారంలో ఉన్న పంజాబ్​ ప్రభుత్వం కూడా దివాలా దిశగా కొనసాగుతుందన్నారు. ఆదాయానికి మించి ఖర్చు చేస్తే అభివృద్ధి, ప్రజలపై పరిణామాలు పడతాయన్నారు. హిమాచల్​ లో జీతాలిచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ పార్టీల విధానాలతో నష్టపోయేది తెలంగాణ ప్రజలే అన్నారు. పేదవారు, మధ్య తరగతి వారే నష్టపోతారన్నారు. కాబట్టి మేధావులు ఈ రాష్​ర్టం ఎటుపోతుందో అని ఆలోచించాలని, ముందుచూపుతో తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

క్లిష్ట సమయాల్లోనూ సమాంతరంగా ముందుకు..
శ్రీలంక, బంగ్లాదేశ్​, ఆఫ్ఘానిస్థాన్​ పరిస్థితులు చూశారన్నారు. అమెరికా కూడా ఆర్థిక సంక్షోభంలో ఉందన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుందన్నారు. కానీ భారత్​ లో అనేక సంక్షోభాలు ఎదురైనా అన్ని రంగాలను సమాంతరంగా ముందుకు తీసుకువెళుతున్న ప్రభుత్వం మోదీ బీజేపీ ప్రభుత్వమన్నారు. ఇది చిన్న విషయం కాదన్నారు. 

ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్న పార్టీ బీజేపీ ఒక్కటే..
బీజేపీకి చెందిన ముగ్గురు అభ్యర్థులను గెలిపించాలని కిషన్​ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సమస్యలను పార్లమెంట్​ లో రఘునందన్​ రావు లేవనెత్తితో పలువురు ఎంపీలు తనకు ఫోన్​ చేసి ఆరా తీశారని, సమస్యలపై చాలా బాగా మాట్లాడారని చెప్పారని అన్నారు. బీజేపీ అభ్యర్థులెవ్వరైనా దేశం, సమాజం కోసం పనిచేస్తున్నారని దీంతో ఋజువవుతుందన్నారు. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు తమ కుటుంబం పేరుతోనే నడుస్తాయన్నారు. బీజేపీలో అలాంటి విధానం లేదన్నారు. చాయ్​ అమ్ముకునే వ్యక్తి దేశానికి ప్రధాని అయ్యే స్థాయికి వచ్చారన్నారు. ఆదివాసీ ప్రాంతంలో ఉన్న మహిళ రాష్ర్టపతిని చేసిన ఘనత బీజేపీదే అన్నారు. బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మినవారే దేశాన్ని పాలించే వారు ఉన్నారని అన్నారు. కుటుంబ ఆధారిత ప్రైవేట్​ లిమిటెడ్​ కంపెనీలా రాజకీయం మారిపోయిందన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఒకే ఒకపార్టీ పనిచేస్తుందని అదే బీజేపీ అన్నారు. శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 26 శివరాత్రి ఉపవాస దీక్ష తీసుకొని 27న ఓటు వేసిన తరువాతే దీక్ష విరమించాలని బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో సభాధ్యక్షత వహించిన గోదావరి, పార్లమెంట్​ సభ్యులు రఘునందన్​ రావు, రాజేశ్వర్​ రావు, రాజశేఖర్​ రెడ్డి, శ్రీనివాస్​ గుప్త, వెంకటేశ్​, శ్రీనివాస్​, శిల్పా తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. 
...............