బోనమెత్తిన పల్లెలు.. పరవశించిన భక్తజనం
Bonametthina village
నా తెలంగాణ, షాద్ నగర్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల పండుగ ఉత్సవాలు పల్లెలలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రావణమాసం చివరికి చేరుకోవడంతో నియోజకవర్గంలోని పల్లెలు బోనమెత్తాయి. గురువారం కేశంపేట మండల కేంద్రంలో చెర్ల మైసమ్మ బోనాలు, కాకునూరు గ్రామంలో పోచమ్మ బోనాలను గ్రామస్తులు వైభవంగా జరుపుకున్నారు. మహిళలు డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాల నడుమ బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రజలందరూ చల్లంగా ఉండాలని, పంటలు బాగా పండాలని మహిళలు అమ్మవారిని మొక్కుకున్నారు.