శవాలపై పేలాలు ఆత్మహత్యలే అస్త్రాలు

సర్కారుకు సోయిలేదు.. ప్రతిపక్షానికి బాధ్యత లేదు.. అన్నదాతలు, ఆటో డ్రైవర్లను ఆదుకోవడంలో కాంగ్రెస్​ విఫలం .. బాధితులకు అండగా నిలవాల్సిన బీఆర్​ఎస్​ ఆత్మహత్యల పేరుతో కుంగదీసే మాటలు.. అధికార కాంగ్రెస్​.. ప్రతిపక్ష బీఆర్ఎస్ తీరుతో జనం బేజారు.. మహిళలకు ఫ్రీ బస్​ తో ఆదాయం కోల్పోయిన ఆటోడ్రైవర్లు.. నీళ్లు లేక పంటలు ఎండి, రాళ్ల వానలకు అంత కోల్పోయిన రైతన్నలు

Mar 26, 2024 - 15:41
 0
శవాలపై పేలాలు ఆత్మహత్యలే అస్త్రాలు

నా తెలంగాణ, హైదరాబాద్​: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సర్కారు ఒకవైపు, శవాలపై పేలాలు ఏరుకునే విపక్షం మరోవైపు తెలంగాణ ముఖచిత్రంపై రక్తపు మరకలు అంటించడంలో పోటీ పడుతున్నాయి. రాజకీయాలే ప్రధానంగా..సవాళ్లు ప్రతి సవాళ్లే పరిష్కారంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వికృత క్రీడ అమాయక తెలంగాణ సమాజం పట్ల తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. అధికారంలో ఉంటే ఓ రకంగా..ప్రతిపక్షంలో కూచుంటే ఇంకో రకంగా స్పందించడం ఈ రెండు పార్టీల స్వార్థ రాజకీయాలకు అద్దం పడుతున్నది. బాధ్యతగల హోదాలో ఉండి తమ ప్రవర్తన కొన్ని వేల మందిని ప్రభావితం చేస్తుందన్న స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్, బీఆర్ఎస్ అగ్రనాయకులు. 

ఆటోడ్రైవర్ల చావు లెక్కలు

పేద, మధ్యతరగతి ప్రజల ఆశలు, అవసరాలను ఆసరా చేసుకుని అలవికాని హామీలిచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీల అమలులో ఆపసోపాలు పడుతున్నది. సులువుగా అమలయ్యే పథకాలు మరికొందరి జీవితాలను కష్టాల పాల్జేస్తాయన్న ధ్యాస లేకుండాపోయింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్ర మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి అవకాశం ఇచ్చింది. ఇది చిరుద్యోగులు, కూలీలు, మధ్యతరగతి మహిళలకు ఎంతో ఊరటనిచ్చింది. ఇప్పటికే కోట్లమంది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారు. కానీ ఈ పథకం ప్రభావం వెంటనే ఆటోవాలాలపై పడింది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉపాధి చూపు లేక కాంట్రాక్టులు, కమీషన్ల ధ్యాసలో సాగిన పాలన ఫలితంగా రాష్ట్రంలో నిరుద్యోగులు పెరిగిపోయారు. ఉపాధి కోసం ప్రత్యామ్నాయంగా ఆటోలను నమ్ముకుని జీవిస్తున్నరు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణంతో గిరాకీల్లేక రోడ్డున పడ్డ ఆటోవాలాలకు అండగా మేమున్నామంటూ బీఆర్ఎస్ ముందుకొచ్చింది. ఇదేదో వారిని ఆదుకోవడానికి కాదు..రోజూవారి ఆటోవాలాల ఆత్మహత్యలను లెక్కించడానికి. ఎప్పటికప్పుడు ఆటోవాలాల ఆత్మహత్యలను లెక్కించి మీడియా ముందు పెట్టి మిగతా ఆటోవాలాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఇది ఉపయోగపడుతున్నది. ఇప్పటివరకు 32 మంది ఆటోవాలాలు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ ఇటీవల బీఆర్ఎస్ అగ్రనేత హరీశ్ రావు ప్రకటించి వారి కుటుంబాల్లో మరింత దిగులును పెంచారు. బీఆర్ఎస్ మరో అగ్రనేత కేటీఆర్ ఏకంగా ఆటోలో అసెంబ్లీకి వచ్చి హడావుడి చేశారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆటోవాలాలతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సమావేశమై ధైర్యం చెప్పారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆటో డ్రైవర్లు కోల్పోతున్న ఆదాయానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామంటూ హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి వంద రోజులు గడిచింది. సీఎం మాటకు అతీగతీ లేదు. సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఏం చేయాలో పాలుపోక అయోమయంలో ఉన్న ఆటోడ్రైవర్లకు ధైర్యాన్నివ్వాల్సిన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు మరింత కుంగదీసి, వారిని రెచ్చగొట్టి రాజకీయంగా వాడుకుంటున్నది.

రైతు బాధలతోనూ రాజకీయమే

ప్రస్తుతం అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల సాగునీరందక చేతికొచ్చిన పంట దెబ్బతిన్నది. వేల ఎకరాల్లో పంటనష్టం జరగడంతో రైతు కంట కన్నీరొస్తున్నది. మరోవైపు రైతుబంధు పంపిణీలో జాప్యం జరుగుతున్నది. రైతుబంధు రాలేదన్నోన్ని చెప్పుతో కొట్టండని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలతో రైతులెవ్వరూ ప్రశ్నించలేకపోతున్నరు. ఈ నేపథ్యంలో తాజాగా దెబ్బతిన్నపంటలను పరిశీలించడానికి బీఆర్ఎస్ నేతలు బయలుదేరారు. జనగామ జిల్లాలో నష్టపోయిన పంట పొలాలను బీఆర్ఎస్ నేత హరీశ్ రావు పరిశీలించారు. ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని లెక్కలు విప్పారు. సీఎం రేవంత్ హైదరాబాద్ రాజకీయాలకే పరిమితమై రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. మేడిగడ్డ అంశాన్ని ప్రధాన అస్త్రంగా మలుచుకుని ఎన్నికల్లో లబ్ధిపొందిన కాంగ్రెస్ పార్టీ సాగనీరు, రైతుబంధు మొదలైన విషయాల్లో పట్టించుకోలేదన్న ఆరోపణలొచ్చాయి. కేంద్రం నుంచి వచ్చిన కిసాన్ సమ్మాన్ యోజన డబ్బులు, సబ్సిడీ ఎరువులు మినహా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఇలా ఉంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల లెక్కలు వెల్లడించడంలో మునిగిపోయింది.  కొత్త ప్రభుత్వం కొలువుదీరాక సిరిసిల్ల నేతన్నలను పట్టించుకోకపోవడంతో ఉపాధి కోల్పోయారని ఇటీవల మాజీమంత్రి కేటీఆర్ ఆరోపించారు. బతుకమ్మ చీరల పేరిట తమ ప్రభుత్వం ఉపాధి కల్పించిందని కాంగ్రెస్ ప్రబుత్వం పని ఇవ్వకపోవడంతో నేత కార్మికులకు ఆత్మహత్యలే శరణ్యమయ్యాయంటూ విమర్శించారు. 

బాధ్యత లేని ప్రకటనలు

ఆటోడ్రైవర్లు, రైతుల ఆత్మహత్యల విషయంలో బాధ్యత మరిచిన అధికార ప్రతిపతక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో పబ్బం గడుపుకుంటున్నాయి. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆత్మహత్యల్లేవా అంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగుతుండగా పాలన చేతగాక మాపై విమర్శలా అంటూ బీఆర్ఎస్ వాదిస్తున్నది. రెండు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ విమర్శలకు ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రతి పార్టీకి రాజకీయ వ్యూహాలు ఉంటాయి. ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీసి తమది పైచేయి అనిపించుకోవడానికి ఎత్తులు వేయడం సహజం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచీ ఆత్మహత్యలను అస్త్రంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీరి రాజకీయల కోసం అమాయకులు బలవుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆత్మహత్య చేసుకున్న రైతులకు లక్షన్నర ఆపద్బంధు ఆర్థిక సాయం ప్రకటించారు. ఆ తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. మానస్తత్వ శాస్త్రవేత్తలు దీన్ని ఖండించారు కూడా. ఆర్థిక ప్రయోజనం ఆశ చూపితే బలవన్మరణాలు పెరుగుతాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. బీఆర్ఎస్ నేతలు రైతు ఆత్మహత్యలను ఎప్పటికప్పుడు లెక్కలు వెల్లడిస్తూ వచ్చారు. ఈ పరిణామాలు అమాయక రైతులను మరింత మానసిక దౌర్బల్యానికి గురి చేశాయి. ఉపాధి లేకుంటే ప్రత్యామ్నాయం చూపడమో లేక ధైర్యం చెప్పడమో నేతల బాధ్యత. అది మరిచి రాజకీయ ప్రయోజనాల కోసం బాధ్యతలేని ప్రకటనలు చేయడం ప్రజలకు శాపంగా మారింది. 

ధైర్యాన్నిచ్చే నాయకత్వం కావాలి

నమ్ముకున్న నాయకులు ఇచ్చే ధైర్యమే ప్రజలను ఎన్ని కష్టాలొచ్చినా బతికించేలా చేస్తుంది. పదేపదే ఆత్మహత్యలను ప్రస్తావిస్తూ ప్రజలు మానసికంగా కుంగిపోయేలా చేయడం రాజకీయ పార్టీలకు తగదన్నది మానసిక శాస్త్రవేత్తల సూచన. పోరాట స్ఫూర్తితో మొదలైన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సుమారు 1200 మంది యువకుల ఆత్మహత్యలకు దారితీయడంలోనూ పలువురి అనాలోచిత చర్యల కారణంగానే అన్నది స్పష్టం. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి దానికి మరింత ఆజ్యం పోసింది. తాజాగా మళ్లీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు, రాజకీయ ఆధిపత్యం, విపక్షాలపై కక్ష సాధింపు కోసం పెడుతున్నంత శ్రద్ధ పాలన మీద పెడితే బాగుంటుందని పరిశీలకుల అభిప్రాయం. విపత్తుల సమయంలో సహాయక చర్యలపై అధికార పక్షం ఎంత దృష్టి పెట్టాలో ప్రతిపక్షం అంతే ఓర్పుతో ప్రజలకు ధైర్యాన్నివ్వాలి.