బంగ్లా అక్రమ వలసలపై కొరడా 11 మంది అరెస్ట్
11 people were arrested in connection with the illegal immigration of Bangladesh
డోర్ టు డోర్ ఆపరేషన్ లో ఢిల్లీ పోలీసుల చర్యలు ముమ్మరం
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. అక్రమంగా చొరబడిన వారిని డోర్ టు డోర్ ఆపరేషన్ ద్వారా గుర్తించి అరెస్టు చేస్తున్నారు. అలాగే దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు సహకరించిన అక్రమ ఇమ్మిగ్రేషన్ రాకెట్, డాక్యుమెంట్ ఫోర్జరీలు, టెక్ నిపుణులు సహా 11 మందిని అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం నుంచే డిప్యూటీ కమీషన్ ఆఫ్ పోలీస్ అంకిత్ చౌహాన్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పెద్దఎత్తున అక్రమ చొరబాట్లపై చర్యలకు ఉపక్రమించారు. ఈ ఆపరేషన్ లో ఆరుగురు బంగ్లాదేశీయులను అరెస్టు చేయగా, వీరికి ఆయా కార్డులను అందించేందుకు, దేశంలోకి చొరబడేందుకు సహకరించిన మరో ఐదుగురిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి పలు రకాల పత్రాలు, ఆధార్, పాన్ కార్డు, ఓటర్ ఐడీలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా డీసీపీ చౌహాన్ మాట్లాడుతూ.. వీరంతా అక్రమ మార్గంలో భారత్ లోకి ప్రవేశించారని గుర్తించామన్నారు. వీరు ఢిల్లీకి రావడం, ఇక్కడ ఆధార్, పాన్, ఓటర్ ఐడీలను పొందేందుకు సహకరించిన పలువురు టెక్ నిపుణులను కూడా అరెస్టు చేశామన్నారు. ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా అక్రమ వలసలపై పోలీసు కమిషనర్ ను ఆదేశించారు. ఢిల్లీలో వెయ్యిమంది వరకు అక్రమంగా బంగ్లాదేశీయులు నివసిస్తున్నారని ఇంటలిజెన్స్ సమాచారం నేపథ్యంలో వారిని గుర్తించి కటకటాల్లోకి నెడుతున్నారు.