ప్రయాగ్ రాజ్ లో రోడ్డు ప్రమాదం 10 మంది మృతి
19మందికి తీవ్ర గాయాలు

లక్నో: ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభమేళా నుంచి తిరిగి వెళుతున్న భక్తుల బృందం వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందగా, 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం అర్థరాత్రి 2.30 గంటల ప్రాంతంలో ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానిక ఎస్పీ వివేక్ యాదవ్, కమిషనర్ తరుణ్ గబా, డిఎం రవీంద్ర కుమార్ మాంధాద్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బొలెరో వాహనంలో చిక్కుకున్న వారిని అతికష్టం మీద రెండు గంటలపాటు శ్రమించి బయటకు తీశారు. గాయపడిన వారిని రామ్‌నగర్ సిహెచ్‌సిలో చేర్చారు. ప్రాథమిక చికిత్స తర్వాత, అందరినీ స్వరూప్ రాణి ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపారు.
ప్రమాదంపై కమిషనర్ తరుణ్ గబా మాట్లాడుతూ బొలెరో లో కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించి వారణాసికి వెళుతున్నారని చెప్పారు. మృతులంతా చత్తీస్ గఢ్ కోర్బా జిల్లా నుంచి వచచారని తెలిపారు. మీర్జాపూర్ హైవే మేజా ప్రాంతంలోకి రాగానే అత్యంత వేగంగా వెళుతున్న బొలెరో వాహనం కంట్రోల్ తప్పి బస్సును ఢీకొట్టిందన్నారు. బొలెరో వాహనం వేగాన్ని గమనించిన బస్సు డ్రైవర్ దూరం నుంచి చూసే పక్కన ఆపివేశాడన్నారు. అయినా బోలెరోను కంట్రోల్ చేయలేకపోయారన్నారు. దీంతో ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. కాగా బస్సులో ఉన్న 19 మందికి కూడా గాయాలయ్యాయని వీరంతా మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ జిల్లా నివాసితులుగా గుర్తించామన్నారు. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం పూర్తి తుక్కుతుక్కుగా మారిందని చెప్పారు. ప్రమాదానికి అతివేగమే కారణమని కమిషనర్ తరుణ్ గబా చెప్పారు.