దానం ప్రచారానికి స్పందన కరవు

బీఆర్​ఎస్​ ఖైరతాబాద్​ ఎమ్మెల్యేగా గెలిచి.. కాంగ్రెస్​ కండువా కప్పుకొని సికింద్రాబాద్​ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన దానం నాగేందర్​ ప్రచారానికి స్పందన కరువైంది.

May 2, 2024 - 16:04
 0
దానం ప్రచారానికి స్పందన కరవు
  • సికింద్రాబాద్​ లో మూడో స్థానంలో కాంగ్రెస్​
  • సహకరించని సొంత పార్టీ నాయకులు
  • ప్రచారంలో ప్రజల నుంచీ దొరకని మద్దతు
  • నామమాత్రపు క్యాంపెయిన్ తో మమ

నా తెలంగాణ, సికింద్రాబాద్​: బీఆర్​ఎస్​ ఖైరతాబాద్​ ఎమ్మెల్యేగా గెలిచి.. కాంగ్రెస్​ కండువా కప్పుకొని సికింద్రాబాద్​ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన దానం నాగేందర్​ ప్రచారానికి స్పందన కరువైంది. సొంత పార్టీ నాయకులే.. ఆయన చేరికను వ్యతిరేకించారు. ఇప్పుడు ప్రచారంలోనూ దానంకు సహకరించడం లేదని తెలుస్తున్నది. కార్పొరేటర్​ విజయా రెడ్డి కాంగ్రెస్​ నాయకురాలిగా బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అయిన దానం నాగేందర్​ పై గత కొన్నేండ్ల నుంచి ప్రజా సమస్యలపై పోరాడారు. ఇప్పుడు దానం కూడా కాంగ్రెస్​ పార్టీలోకి రావడంతో కాంగ్రెస్​ కేడర్​ మొత్తం విజయారెడ్డి వైపే ఉన్నట్లు తెలుస్తున్నది. దీంతో చేసేదేం లేక.. బీఆర్​ఎస్​ నుంచి తన వెంట తెచ్చుకున్న కొద్దిమంది అనుచరులతో దానం ప్రచారాన్ని మమ అనిపిస్తున్నారు. 

వెంకటేశ్వర కాలనీ.. 

ఖైరతాబాద్​ నియోజకవర్గంలోని వెంకటేశ్వర కాలనీలో దానం నాగేందర్​ ఎంపీ అభ్యర్థిగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఆయన అనుచరులు మినహా పెద్దగా జనం ఎవరూ లేకపోవడం గమనార్హం. దానం ప్రచారంలో ముఖ్య నాయకులు ఎవరైనా పాల్గొంటున్న సందర్భంలో కొద్దిపాటి జనం కనిపిస్తున్నారు. దీంతో దానం అనుచరులు ఆ రద్దీ ఉన్న ఫొటోలనే సోషల్​ మీడియాలో వైరల్​ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం దానం ప్రచారం ఎక్కడా ప్రభావం కనిపించడం లేదని కాంగ్రెస్​ ముఖ్యనాయకుడు ఒకరు తెలిపారు. 

మూడో స్థానంలో..

సికింద్రాబాద్​ పార్లమెంట్​ స్థానంలో బీజేపీ నుంచి సిట్టింగ్​ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి, బీఆర్​ఎస్​ నుంచి సికింద్రాబాద్​ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్​, కాంగ్రెస్​ నుంచి దానం నాగేందర్​ బరిలో ఉన్నారు. కాగా దానం నాగేందర్​ పార్టీ ఫిరాయింపు అటు బీఆర్​ఎస్​, ఇటు కాంగ్రెస్​ పార్టీల నాయకులతోపాటు, సికింద్రాబాద్​ ప్రజలకు కూడా నచ్చలేదు. దానం పూటకో పార్టీ మారే నేత అనే విమర్శలు ఉన్నాయి. ఇవీగాక భూ కబ్జా, సెటిల్​ మెంట్ల ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా సికింద్రాబాద్​ లో దానం మూడో స్థానంలో ఉన్నారు. పోటీ బీజేపీ వర్సెస్​ బీఆర్​ఎస్​ గా కనిపిస్తున్నది.