రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల విడుదల
యూఏఇ సహాయంతో కీలక ముందడుగు
వైషమ్యాలు రెచ్చగొట్టే అమెరికా చర్యలపై పలు దేశాల మండిపాటు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఓ వైపు భీకర యుద్ధాన్ని కొనసాగిస్తూనే పాత సంవత్సరం (2024) చివరి రోజున రష్యా–ఉక్రెయిన్ లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 189ఉక్రెయిన్, రష్యా 150 మంది యుద్ధ ఖైదీలను విడుదల చేశాయి. యూఎఈ (యూనైటెడ్ అరబ్ఎమిరెట్స్) సహాయంతో ఖైదీల మార్పిడి కోసం ఒప్పందం ఖరారు చేసుకోగా మంగళవారం ఖైదీలను ఇరుదేశాలు విడుదల చేశాయి. దీంతో ఆయా కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
సైనికులు, సరిహద్దు గార్డులు, దేశ పౌరులు యుద్ధ ఖైదీల్లో ఉన్నారు. ఇరుదేశాలు మార్పిడిలో సహాయం చేసిన యూఎఈకి రష్యా, ఉక్రెయిన్ లు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరుదేశాల ఖైదీలు బస్సుల్లో తమ తమ దేశాలకు బయలుదేరిన దృశ్యాలను మీడియాతో పంచుకున్నాయి. అయితే ఇరుదేశాల ఖైదీల విడుదలకు ముందే సైనికులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఇదెలా ఉండగా అమెరికా 2.5 బిలియన్ డాలర్ల విలువైన అదనపు ఆయుధాలను ఉక్రెయిన్ కు పంపుతామని అమెరికా జో బైడెన్ ఇటీవలే ప్రకటించారు. అమెరికా చర్యలను ప్రపంచదేశాలు ఖండిస్తున్నాయి. ఓ వైపు శాంతి నెలకొంటున్న సమయంలో బైడెన్ ఇలాంటి ప్రకటనలతో ఇరుదేశాల్లో మరింత వైషమ్యాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించడాన్ని తప్పుబట్టాయి.