జై, వీరూ జోడి అదుర్స్​

గబ్బర్​ పాత్రలో విపక్షాలు మోదీ, షాల వల్లే అనేక సమస్యలకు పరిష్కారం సాహసోపేతమైన నిర్ణయాలకు పెట్టింది పేరు బృందావనం తనకు అత్యంత ఇష్టమైన ప్రాంతం మీడియాతో మథుర ఎంపీ అభ్యర్థి బసంతి (హేమామాలిని)

Apr 25, 2024 - 15:07
 0
జై, వీరూ జోడి అదుర్స్​

లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షాల కాంబినేషన్​ షోలే సినిమాలో జై, వీరు (అమితాబ్​, ధర్మేంద్ర)గా  బీజేపీ మథుర ఎంపీ అభ్యర్థి, ప్రముఖ సినీ నటి హేమామాలిని (బసంతి) అన్నారు. వీరిద్దరి కాంబినేషన్​ లో ఎలాంటి సమస్యలైనా ఇట్టే పరిష్కరించుకోగలరని కితాబిచ్చారు. గబ్బర్​ సింగ్​ పాత్రలను విపక్షాలే పోషిస్తున్నాయని బసంతి విమర్శించారు. హేమామాలిని రెండో విడత జరగనున్న ఎన్నికలలో బీజేపీ తరఫున మథుర ఎన్నికల అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. 

యమునా ప్రక్షాళనపై మాట్లాడుతూ అది మోదీ వల్లే సాధ్యపడిందన్నారు. ‘నమామి గంగే ప్రాజెక్టు’ కూడా మోదీ వల్లే సాధ్యమైందన్నారు. ఇక్కడ అనేక మంది నిరుపేదలకు గృహాలు లభించాయన్నారు. మోదీ ఖచ్చితంగా హ్యాట్రిక్​ సాధించబోతున్నారని, మూడోసారి విజయశంఖారావాన్ని ఊదబోతున్నట్లు తెలిపారు. ఇందుకు శుభసూచకంగా అయోధ్య రామ మందిర నిర్మాణమేనని తెలిపారు. 500 ఏళ్లుగా పరిష్​కారం కాని సమస్యను కేవలం ఐదేళ్లలో శాంతియుతంగా పరిష్కరించిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఈ ఇద్దరి జోడీ (మోదీ, అమిత్​ షా) అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ఆర్టికల్​ 370 రద్దు, ట్రిపుల్​ తలాక్​, యూసీసీ కూడా ఇందులో ప్రధానమైనవని ‘బసంతి’ తెలిపారు. 

దేశ దిశను ఈ ఇద్దరు కలిసి మార్చేశారని, నేడు ప్రపంచదేశాల్లో భారత్​ కీర్తి పతాకాలు ఎగరడానికి వీరిద్దరి సాహసోపేతమైన నిర్ణయాలే కారణమని అన్నారు. విపక్ష పార్టీలే గబ్బర్​ సింగ్​ పాత్రలను పోషిస్తున్నాయని బసంతి విమర్శించారు. తనకు బృందావనం (నేటి మథుర) అంటే చాలా ఇష్టమని అన్నారు. తాను స్వతహాగా డ్యాన్సర్​ ని కావడంతో ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధం చెప్పలేనిదన్నారు. దేవి దేవతలకు సంబంధించిన నృత్యాలు తాను ఎన్నో చేశానని వివరించారు. ప్రస్తుతం ఆ బృందావనం నుంచే తాను పోటీలో ఉండడం ఆశ్చర్యకరమన్నారు. తనకు శ్రీకృష్ణుడి ఆశీస్సులు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.