మహాకుంభమేళా @ 42 కోట్లు!
Mahakumbh Mela @ 42 Crores!

లక్నో: మహాకుంభమేళాలో పుణ్యస్నానాలాచరించేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో మధ్యాహ్నం వరకే 1.23 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలాచరించారు. ప్రయాగ్ రాజ్ కు దారితీసే 8 రహదారుల్లో 25 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. దీంతో వాహనాలు మెల్లిగా కదులుతున్నాయి. త్రివేణి సంగమ ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కాగా ఆదివారం మధ్యాహ్నంతో పుణ్య స్నానాలాచరించిన వారి సంఖ్య 42 కోట్లకు పైగా చేరుకుందని అధికారులు వివరించారు. గత ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఆదివారం అన్ని రహదారుల్లో ప్రత్యేక దళాలను రంగంలోకి దించారు. స్నాన ఘాట్ ల వద్ద ప్రత్యేక బారికేడ్లు, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. వారణాసి, లక్నో, కాన్పూర్, రేవా నుంచి ప్రయాగ్ రాజ్ కు వచ్చే దారుల్లో 25 కి.మీ. మేర జామ్ ఏర్పడింది. ప్రయాగ్ రాజ్ కు దారి తీసే అంతర్త రహదారులు సులేం సారాయ్, నవాబ్ గంజ్, గౌహానియా నుంచి రేవా,ఝాన్సీల్లో కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాగ్ రాజ్ కు వచ్చే విమానాలు, రైళ్లు, బస్సులు, ప్రైవేట్ వాహనాలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లు కూడా మహాకుంభమేళాలో ఆదివారం పుణ్య స్నానాలాచరించారు.