బీఆర్​ఎస్​ పోటీ ఏ పార్టీకి మేలు?

పతన వేగాన్ని ఆపి భారత్‌ రాష్ట్ర సమితిని బతికించడానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కలుగు బయటకు వచ్చి, జూలు దులిపి పెద్ద స్వరంతో గాండ్రించారు.

May 8, 2024 - 09:39
 0
బీఆర్​ఎస్​ పోటీ ఏ పార్టీకి మేలు?

పతన వేగాన్ని ఆపి భారత్‌ రాష్ట్ర సమితిని బతికించడానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కలుగు బయటకు వచ్చి, జూలు దులిపి పెద్ద స్వరంతో గాండ్రించారు. ధ్వని తెలంగాణ రాష్ట్రమంతా వినిపించింది. కొంత మేర ప్రభావం ఉండొచ్చు గాక. ఇది బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకును అక్కడక్కడ కాపాడటం, కార్యకర్తల శ్రేణుల్ని చెదరకుండా చూడటం, నాయకులు చేజారి పోకుండా ఆపటం వరకే పరిమితమౌతుందా? లేక ఒకటి, రెండు లోక్‌సభ సీట్లు తీసుకురావటం వరకూ వెళుతుందా అన్నది వేచి చూడాలి. అంతకు మించి ఈ సారి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రత్యక్ష ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి తర్వాత పార్టీ చతికిల పడింది. శ్రేణులు డస్సిపోయి ఉన్నాయి. నాయకులు ఏకంగా పార్టీనే వీడి ప్రత్యర్థి పార్టీల్లో చేరిపోతుంటే, కొందరు అభ్యర్థులవుతుంటే అదినాయకత్వం కలత చెందింది. పార్టీ తరపున అభ్యర్థిగా ప్రకటించిన వ్యక్తి కూడా పార్టీ వీడి ఎదుటి పార్టీ అభ్యర్థి అయ్యారు. డబ్బు ఇచ్చి, ప్రచారం చేసి పెడతామన్నా, ఎన్నికల్లో పోటీకి తమ తరఫున గట్టి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి. పార్టీ ఆవిర్భావం నుంచి తొలిసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ సభ్యులెవరూ ఈ సారి బరిలో లేరు. ఇవన్నీ చూశాక, జనంలో కూడా బీఆర్‌ఎస్‌ బాగా బలహీనపడిపోయిందనే అభిప్రాయం కలిగింది. బీఆర్‌ఎస్‌ పని అయిపోయింది, ఉనికి కనుమరుగయ్యే పరిస్థితి అని కాంగ్రెస్‌, బీజేపీలు ఎంతగా ప్రచారం చేసినా.. కేసీఆర్‌ వీధుల్లోకి వచ్చి, ప్రచారం చేపట్టాక వచ్చిన మార్పును వారు గుర్తిస్తున్నట్టు లేదు. ఏర్పాట్లు చేయకుండా ఎన్నికల సభలు, సభలకు జనం రాక జరిగే రోజులు కావివి. కేసీఆర్‌ ప్రచారం తర్వాత ఆశ్చర్యకరంగా కొన్ని నియోజకవర్గాల్లో ఓటు వాటాను బీఆర్‌ఎస్‌ క్రమంగా పెంచుకుంటోంది. పోలింగ్‌ వారంలోకి వచ్చిన తాజా పరిస్థితుల్లో రాజకీయ సమీకరణాలు ఒకింత వేగంగానే మారుతున్నాయి. ఇప్పటివరకు తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీలు నువ్వా – నేనా అన్నట్టు తలపడుతున్నాయి. రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాలు పదిహేడులో రెండంకెల స్థానాలు తమకంటే తమకని ఆ రెండు పార్టీలు దావా చేస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ సొంతంగా తెచ్చుకోగల స్థానాల సంగతెలా ఉన్నా, దాని ఉనికి, క్రియాశీలత, ప్రభావం అన్నది కాంగ్రెస్‌, బీజేపీ దక్కించుకునే స్థానాల సంఖ్య హెచ్చు – తగ్గుల్ని నిర్దేశించే పరిస్థితులు బలపడుతున్నాయి. బీఆర్‌ఎస్‌ పూర్తిగా బలహీనపడి, ఎక్కడా ఉనికి కూడా చాటుకోలేని స్థితికి పడిపోతే.. రెండంకెల స్థానాలు బీజేపీ తేలిగ్గా పొందగలుగుతుంది. అలా కాకుండా, బీఆర్‌ఎస్‌ నిలదొక్కుకొని గుర్తించదగిన సంఖ్యలో ఓట్లను చీల్చుకున్న చోట, అది ముక్కోణపు పోటీగా మారి కాంగ్రెస్‌ అవకాశాలు మెరుగయ్యే వాతావరణం కనబడుతోంది. అప్పుడు రెండంకెల స్థానాలు కాంగ్రెస్‌కు దక్కి, బీజేపీ గెలుచుకునే స్థానాల సంఖ్య ఆ మేర తగ్గే అవకాశముంటుంది. ఇదీ బీఆర్‌ఎస్‌ పరోక్ష ప్రభావం!

వారికే ఆందోళన

మాజీ సీఎం కేసీఆర్‌ ఈ ఎన్నికల ప్రచార బరిలోకి దిగి కొంత హల్‌చల్‌ చేశారు. ఆయన పాల్గొన్న సభలకు జనం కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అటు కేంద్రంలో పాలకపక్షమైన బీజేపీ పైన, ఇటు రాష్ట్రంలో అధికార పక్షం కాంగ్రెస్‌ పైన సమానంగా ఆయన ధ్వజమెత్తుతున్నారు. పది, పన్నెండు స్థానాల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించండి, ప్రజల పక్షాన నిలిచి పోరాడటానికి తమకొక ఆధారం దొరుకుతుందని ప్రజలకాయన విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తల శ్రేణులు, సానుభూతిపరుల్లో కొంత కదలిక మొదలైంది. ఫలితంగా, కలిసొస్తే మేమూ గెలిచేంత గట్టి పోటీ ఇవ్వగలం అని కింది స్థాయి నాయకులు అక్కడక్కడ మాట్లాడుతున్నారు. కొన్ని పాకెట్లలో బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఓటర్లు నిలబడుతున్నట్టు ‘పీపుల్స్‌ పల్స్‌’ వంటి సర్వే సంస్థల ప్రాథమిక అధ్యయనాల్లో సంకేతాలున్నాయి. మరి, ఇది కడదాకా నిలిచి, సీట్లు గెలిచిపెట్టేందుకు సరిపోతుందా? అన్న సందేహాలూ ఉన్నాయి. ఈ సానుకూలత సీట్ల కిందకు మారకపోతే.... మొదట కలత చెందేది బీటీ(బంగారు తెలంగాణ) బ్యాచ్‌! ఎందుకంటే, పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ది పొందింది వాళ్లే! ఏదో రకంగా పార్టీ మళ్లీ బలోపేతం కావాలని వారు గట్టిగా కోరుకుంటున్నారు. పార్టీ అగ్రనాయకులు చెబుతున్నట్టు రెండో, మూడో సీట్లయినా వస్తే బాగుంటుందనేది వారి ఆశ. బీఆర్‌ఎస్‌ ఒక బలమైన రాజకీయ పక్షంగా నిలబడాలని కోరుకునే మరో వర్గం కూడా రాష్ట్రంలో ఉంది. ఉద్యమ నేపథ్యం ఉండి, బీఆర్‌ఎస్‌ను, దాని అధినేత కేసీఆర్‌ను తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా ఇప్పటికీ భావించే వారున్నారు. పార్టీ నాయకత్వం స్వీయ నిర్వాకాలు, నియంతృత్వ దోరణి వల్ల నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడగొట్టారని వారు నమ్ముతున్నారు. ఓడిపోయినా.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పూర్తిగా కనుమరుగు కావొద్దని, ఒక బలమైన ప్రతిపక్షంగా, నిర్మాణాత్మక పాత్ర పోషించాలని వారు కోరుకుంటున్నారు. పాలకపక్షాల తప్పుడు నిర్ణయాల వల్ల రేపేదైనా అన్యాయం జరిగితే, అడ్డుకునే వారుండాలని, ఆ పోరాట పటిమ బీఆర్‌ఎస్‌లో ఉందనేది వారి విశ్వాసం. ఈ ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలిస్తే రాష్ట్రంలో, కేంద్రంలో గట్టి ప్రతిపక్ష పాత్ర పోషించడం తెలంగాణ అస్తిత్వ రక్షణకు మంచిదని వారు భావిస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ నిలబడితే కష్టం కాంగ్రెస్‌కు

అసెంబ్లీ ఎన్నికల నాటి రాజకీయ పరిస్థితులు రేపటి ఎన్నికల ముంగిట్లో యధాతథంగా లేవు. సమీకరణాల్లో కొంత మార్పు వచ్చింది. బయటకు కనిపిస్తున్నట్టే... బీఆర్‌ఎస్‌ కొంత బలహీనపడితే ఆ మేరకు బీజేపీ బలపడుతోంది. ఇది సంస్థాగత – నిర్మాణపరమైన పరిణామం కన్నా భావజాల పరమైంది కాబట్టి కచ్చితమైన కొలతలు, ఫలితాలను చెప్పలేం. కానీ, జనబాహుళ్యంలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి ఈ సమీకరణం ఇలాగే కడదాకా కొనసాగే ఆస్కారం బలంగా ఉంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకే కేసీఆర్‌ రంగ ప్రవేశం! పార్టీగా బీఆర్‌ఎస్‌ ఎంత బలహీనపడితే ఆ మేర ప్రయోజనం బీజేపీకి కలిగే ఆస్కారం ఉంది. ఎందుకంటే, బీఆర్‌ఎస్‌ను వీడి వచ్చే ఓటరు కాంగ్రెస్‌ కన్నా బీజేపీ వైపు మొగ్గే ఆస్కారమే ఎక్కువ. పైగా ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పరంగానో, బీజేపీ పార్టీ పరంగానో కాకుండా ఓటర్లలో ప్రధాని మోదీ అనుకూలత అధికంగా వినిపిస్తోంది. ఇతరేతర పార్టీ బంధం తెంపుకున్న ఓటరు అటువైపు మోగ్గే ఆస్కారం బలంగా ఉంటుంది. అప్పుడది సహజంగానే కాంగ్రెస్‌కు ఇబ్బందికరం! ‘మళ్లీ మనదే అధికారం’ అని ప్రకటనలు చేస్తూ పార్టీ బలోపేతానికి కేసీఆర్‌ చేస్తున్న కృషి ఫలిస్తే వలసలు ఆగిపోవచ్చు. ప్రతి నియోజకవర్గ ప్రచారంలో ఆయన స్వయంగా పాల్గంటున్నందున కార్యకర్తలు గట్టిగా నిలబడవచ్చు. అప్పుడు, పెద్దగా సీట్లు రాపోయినా... పోటీలో బీఆర్‌ఎస్‌కు కూడా గుర్తించదగిన సంఖ్యలో ఓట్లు లభిస్తాయి. అంతట కాకపోయినా కొన్ని నియోజకవర్గాల్లో దీని ప్రభావం ఉంటుంది.

కాంగ్రెస్‌కిది పెద్ద సవాల్‌!

మెజారిటీ స్థానాలు తెచ్చుకోవడం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ముందున్న పెద్ద సవాల్‌! అయిదు నెలల తమ పాలనకు ఈ ఎన్నికల్ని రెఫరెండమ్‌గానే భావించాలని ముఖ్యమంత్రితో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు పలుమార్లు బహిరంగంగా ప్రకటించారు. సాధారణ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీకిప్పుడు మెజారిటీ సీట్లు దక్కే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. మరో పక్క డబుల్‌ డిజిట్‌ స్థానాలు మావే అని బీజేపీ ఢంకా భజాయించి చెబుతోంది. పోలింగ్‌ తేదీ సమీపిస్తుంటే తమ పరిస్థితి ప్రత్యర్థుల కంటే మెరుగవుతున్నట్టు ఎవరికి వారు... బీజేపీ, కాంగ్రెస్‌ రెండు పార్టీలూ చెప్పుకుంటున్నాయి. బయట చేసుకునే ప్రచారం ఎలా ఉన్నా, లోపల మాత్రం తమకున్న వాస్తవ సమాచారం ఆధారంగా ఇరుపార్టీలూ ప్రచార వ్యూహాలతో జాగ్రత్తపడుతున్నాయి. ఏయే పార్లమెంటు స్థానంలో, ముఖ్యంగా ఆయా నియోజకవర్గం కింద ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఏమిటని రెండు ప్రత్యర్థి పార్టీలూ సమాచారం తెప్పించుకొని, విరుగుడు చర్యలు చేపడుతున్నాయి. ఇద్దరికీ బీఆర్‌ఎస్‌ ఉనికి ఒక కీలకాంశమే అయింది.

-– దిలీప్‌ రెడ్డి,
పొలిటికల్‌ ఎనలిస్ట్‌,
పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ
9949099802