ఎయిర్​ ఇండియా 70 విమానాలు రద్దు అనారోగ్యకారణాలతో సిబ్బంది సెలవే కారణం

విచారణ చేపట్టిన ఏవియేషన్​ అథారిటీ అసౌకర్యానిక చింతిస్తున్నామన్న సంస్థ అసౌకర్యంపై ప్రయాణికుల ఆందోళన

May 8, 2024 - 12:22
 0
ఎయిర్​ ఇండియా 70 విమానాలు రద్దు అనారోగ్యకారణాలతో సిబ్బంది సెలవే కారణం

కొచ్చి: ఎయిర్​ ఇండియాకు సీనియర్​ ఉద్యోగులు రూపంలో షాక్​ తగులుతోంది. 12 గంటల్లో గా ఆ సంస్థకు చెందిన 70కు పైగా విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బుధవారం కూడా పలు విమాన సేవలు రద్దు చేస్తున్నట్లు ఎయిర్​ ఇండియా ప్రకటించింది. సీనియర్​ ఉద్యోగులంతా మూకుమ్మడిగా అనారోగ్యం సాకు చూపి సెలవు తీసుకున్నందునే విమానాలు రద్దయినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయాన్ని ఎయిర్​ ఇండియా బయటకు వెల్లడించడం లేదు. 

ప్రయాణికుల ఇబ్బందులను గమనించిన ఏవియేషన్​ అథారిటీ విమానాల రద్దుపై విచారణ జరుపుతోంది. 

విమానాల రద్దుపై ఎయిర్​ ఇండియా సీనియర్​ అధికారి మాట్లాడుతూ.. చివరి నిమిషంలో ఉద్యోగులు అనారోగ్యం కారణంగా సెలవు తీసుకోవడంతోనే విమానాలు రద్దు చేశామన్నారు. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొన్నారు. ప్రయాణికులను ఇతర విమానాల ద్వారా గమ్యస్థానాలకు చేర్చే ప్రయత్నం చేస్తున్నామని అధికారి వివరించారు. ఒకవేళ అల జరగని పక్షంలో వారి టికెట్​ ఖర్చుకు అయిన మొత్తాన్ని భేషరతుగా చెల్లిస్తామని తెలిపారు. అసౌకర్యానికి మన్నించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

ప్రయాణికుల ఆందోళన..

కాగా చివరి నిమిషంలో విమానాల రద్దుతో కేరళలోని విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఆలస్యం జరుగుతుండడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం మొత్తం తెలిసినా ఎయిర్​ ఇండియా కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లనైనా చేయకపోవడం విచారకరమని మండిపడ్డారు. భద్రతా తనిఖీలు నిర్వహించిన తరువాత విమానాన్ని రద్దు చేయటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తమను గమ్యస్థానాలకు చేరుస్తారా? చేర్చరా? విమానాన్ని ఏ సమయానికి నడపనున్నారు? లాంటి విషయాలను అధికారులు తెలపడం లేదని నిరసన వ్యక్తం చేశారు.