35 లక్షలు సభ్యత్వ సేకరణపై హర్షం
మండల, పోలింగ్ బూత్ లలో సభ్యత్వం పూర్తి చేయాలి
రిజిస్టర్ లు పూర్తి చేసుకోవాలి
కమిటీల ఎంపికలో అన్నివర్గాలకు సమప్రాధాన్యతనివ్వాలి
35శాతం కొత్తవారికి అవకాశం కల్పించాలి
నా తెలంగాణ, హైదరాబాద్: బీజేపీ సభ్యత్వ సేకరణలో భాగంగా 35లక్షలకు పైగా చేరుకోవడం సంతోషకరమని తెలంగాణ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం వేదాంత కన్వెన్షన్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
ఇంకా సభ్యత్వ నమోదు కొనసాగుతుందన్నారు. సభ్యత్వంతోపాటు మండల, పోలింగ్ బూత్ కమిటీల్లో కూడా సభ్యత్వం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల చివరి వరకు గ్రామాలు, పోలింగ్ బూత్ లలో సభ్యత్వ నమోదు పూర్తి చేయాలన్నారు.
వందశాతం గ్రామాలలో పోలింగ్ బూత్ కమిటీలు సభ్యత్వ సేకరణ, పరిశీలకులు, ఓటర్ల జాబితా పరిశీలనతో ఎన్నికలకు ముందుకు వెళదామన్నారు. అన్నిచోట్ల సామరస్యంగా వెళ్లాలన్నారు. పోలింగ్ బూత్ కమిటీలు వేసినప్పుడు కూడా సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో సమన్వయం చేసుకోవాలన్నారు. జిల్లా, మండల అధ్యక్ష, పార్టీ కార్యవర్గ ఎన్నిక కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పోలింగ్ బూత్ రిజిస్టర్ లు పూర్తి చేసుకుంటే జిల్లా, మండల ఎన్నికలు సులువుగానే పూర్తి చేసుకోవచ్చన్నారు. మనం తీసుకునే చర్యలు తూతూమంత్రంగా ఉండకూడదన్నారు. అన్ని వర్గాల వారు కమిటీలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
మండల స్థాయిలో అందరినీ కలుపుకొని పోయే, పార్టీని పటిష్టం చేసే వారు వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పక్కన పెట్టాలన్నారు. దళిత, మహిళలు అన్ని మోర్చాలు ఉండాలన్నారు. కమిటీలు వేసే టప్పుడు అందుబాటులో ఉన్నవారి పేరు గాకుండా ఎప్పుడూ అందుబాటులో ఉండేవారి పేర్లకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. మండలాలవారీగా అందరికీ ప్రాధాన్యతనిస్తూ 35 శాతం కొత్తవారిని తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలన్నారు.
రాబోయే రోజుల్లో బీజేపీ పటిష్ఠం చేయాలంటే, ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలంటే నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి 36 శాతం వరకూ ఓటింగ్ పోలింగ్ నమోదైందన్నారు. ఆ ఓటింగ్ ను మరింత బలోపేతం చేస్తూనే అధికారం దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు.