ట్రైన్​ హైజాక్​ 30మంది జవాన్లు మృతి

30 soldiers killed in train hijack

Mar 12, 2025 - 12:50
 0
ట్రైన్​ హైజాక్​ 30మంది జవాన్లు మృతి

బెల్టుబాంబులతో బీఎల్​ ఎ
కొనసాగుతున్న ఆపరేషన్​
బందీలుగా 180మంది సైనికులు
బందీల్లో ఆరుగురు మేజర్లు!
పాక్​–చైనాల ఆధిపత్య ధోరణే కారణం
ఆ ప్రాంత సంపద తరలించుకుపోవడమే అంతర్యుద్ధానికి కారణం

ఇస్లామాబాద్​: పాక్​ ట్రైన్​ హైజాక్​ లో గంటగంటకు మృతుల సంఖ్య పెరుగుతుంది. మంగళవారం 450మందికి పైగా ప్రయాణికులు, ఆర్మీ సిబ్బందితో ప్రయాణిస్తున్న ట్రైన్​ ను బీఎల్​ ఎ (బలూచ్​ లిబరేషన్​ ఆర్మీ) హైజాక్​ చేసింది. పాక్​ జైళ్లలో మగ్గుతున్న తమ వారిని విడుదల చేయాలని, బలూచ్​ ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలనే ప్రధాన డిమాండ్​ ను తెరమీదకు తీసుకువచ్చింది. లేకుంటే బందీలందరినీ చంపివేస్తామని హెచ్చరించింది. కాగా పాక్​ సైన్యం చేపట్టిన ఆపరేషన్​ లో 30 మంది జవాన్లు మృతిచెందగా, వందమంది పౌరులను విడిపించగలిగారు. ఈ ఆపరేషన్​ లో 27 మంది బీఎల్​ ఎ ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టామని పాక్​ సైన్యం ప్రకటించింది.  బుధవారం 180 మంది సైనికులు, ఒక మేజర్ (అహ్సాన్​ జావిద్​)​ కూడా తమ అదుపులో ఉన్నట్లు బీఎల్​ ఎ ప్రకటించింది. అందుకు సంబంధించిన పేర్లతో కూడిన లిస్టును కూడా విడుదల చేసింది. మరోవైపు బీఎల్​ ఎ పాక్​ సైన్యం చర్యలకు దిగడంతో ట్రైన్​ లో బెల్టుబాంబులను ధరించి ట్రైన్​ ను పేల్చివేస్తామని హెచ్చరిస్తుంది. దీంతో షాబాజ్​ ప్రభుత్వం ఏం చేయాలో తోచని నిస్సహాయ స్థితిలో పడింది. 

మేజర్​ అహ్సాన్​ జావిద్​ తోపాటు అతని భార్య, మరో ఆరుగురు మేజర్​ ర్యాంక్​ అధికారులు ఎసీ స్లీపర్​ కోచ్​ లో ప్రయాణిస్తున్నారు. వీరందరినీ  ఇప్పుడు బీఎల్​ ఎ బందీలుగా చేసుకుంది. కాగా ఈ హైజాక్​ పై ప్రభుత్వం, భద్రతా చర్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లుగా కనబడుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అపహరణకు గురైన జాఫర్​ ఎక్స్​ ప్రెస్​ క్వెట్టా నుంచి పెషావర్​ వరకు నడుస్తుంది. బలూచిస్థాన్​ గుండా వెళుతుంది. 

పాక్​–చైనాలపైనే పోరు..
1947 తరువాత తమ ప్రాంతాన్ని బలవంతంగా పాక్​ లో విలీనం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. బలూచిస్థాన్​ ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని డిమాండ్​ చేస్తుంది. ఇక్కడి ప్రాంతంలో పాక్​–చైనాలతో కలిసి చేపడుతున్న అభివృద్ధి ఫలాలను అందించకపోవడం, పాక్​ కు తరలించుకుపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీంతో అప్పుడప్పుడు ఈ ప్రాజెక్టులపై భారీ దాడులకు కూడా పాల్పడుతుంది. ముఖ్యంగా బలూచ్​ ఆర్మీ గ్వాదర్​ పోర్టును లక్ష్యంగా చేసుకుంది. తమ ప్రాంతంలోని విలువైన ఖనిజాలను దోపిడీ చేస్తూ తమ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని బీఎల్​ ఎ పేరుతో ఆర్మీని ఏర్పాటు చేసుకొని దశాబ్దాలుగా పోరాటం కొనసాగిస్తుంది. అధికారిక లెక్కల ప్రకారం ఆరువేల మంది బీఎల్​ ఎ ఆర్మీ ఈ పోరాటంలో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. కాగా ట్రైన్​ హైజాక్​ లో 500మంది పాల్గొన్నట్లు అధికారులు భావిస్తున్నారు. 

నిపుణుల అభిప్రాయాలు..
బలూచిస్థాన్​ కు రావాల్సిన నిధులు, మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్యం, అభివృద్ధిలో పాక్​ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేయడంతోనే ఈ ఉద్యమం మొదలైంది. ఆ ప్రాంతంలోని విలువైన సంపదను తీసుకుంటూ లాహోర్​, ఇస్లామాబాద్​ లాంటి ప్రాంతాల్లో అభివృద్ధికి వినియోగిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుండడం ఇక్కడి ప్రజలకు ఏ మాత్రం రుచించడం లేదు. ఫలితంగా ఇక్కడి ప్రజల్లో పాక్​ – చైనాలపై తీవ్ర అసంతృప్తి జ్వాలలను రగిల్చింది. ఫలితంగానే బీఎల్​ ఎ పోరాటం కొనసాగుతుంది. ఇప్పటికైనా పాక్​ ప్రభుత్వం అన్ని విషయాల్లో బలూచిస్థాన్​ కు అధిక ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధిని చేస్తే ఈ ప్రాంత పోరాటం సమసిపోయినట్లవుతుంది. కానీ పాక్​ ప్రభుత్వం ఈ విషయంపై మొండిపట్టుదల వీడడం లేదు.